‘లవ్ స్టోరీ’ రైటర్ మిట్టపల్లి సురేందర్ కి ఎదురైన చేదు అనుభవం..!
October 12, 2021 / 06:08 PM IST
|Follow Us
సినీ పరిశ్రమ అనేది ఓ రంగుల ప్రపంచమే..! అయితే ఇక్కడా బాగా రాణించాలి అంటే సక్సెస్ అనేది కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. సక్సెస్ అనేది పొందకపోతే ఇక్కడి కళాకారుల దీనస్థితి గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు. విషయంలోకి వెళితే.. ఇటీవల శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘లవ్ స్టోరీ’ లో ‘నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి’ అనే పాట నోటా నానుతూనే ఉంది. ఆ పాటలోని ప్రతీ లిరిక్ ప్రేక్షకులను వెంటాడుతోంది. ఆ పాట ఎవరు అనే సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు.
ఆ పాటని రాసిన రచయిత మిట్టపల్లి సురేందర్. ఈయన ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఉన్నాడు. ‘జార్జి రెడ్డి’ సినిమాలోని ‘వాడు నడిపే బండి’ పాట అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ పాటకి లిరిక్స్ అందించింది కూడా ఈయనే..! ఇదిలా ఉండగా… మిట్టపల్లి సురేందర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితంలో ఎదుర్కొన్న ఓ చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చాడు. నిజానికి అతను తేజ డైరెక్షన్లో నితిన్ హీరోగా వచ్చిన ‘బైపీసీ బద్మాష్ పోరి బాగుంది మామో’ అనే పాటతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడట.
అనూప్ రూబెన్స్ ఆ చిత్రానికి సంగీత దర్శకుడు. ఆ పాట కోసం సురేందర్ కు డబ్బులు కూడా పంపించారట. కానీ మధ్యవర్తి ఆ డబ్బుల్ని తన వద్ద ఉంచుకుని.. సురేందర్ కు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదట.ఈ విషయమై సురేందర్ ఓ కాయిన్ బాక్స్ నుండీ ఆ మధ్యవర్తికి ఫోన్ చేస్తే… ‘ నీకు దర్శకుడు తేజని కల్పించడమే ఎక్కువ.. మళ్ళీ డబ్బులు కూడా అడుగుతావా? లెక్క ప్రకారం అయితే నువ్వే నాకు డబ్బులు ఇవ్వాలి’ అంటూ దారుణంగా మాట్లాడాడట.
కనీసం ఊరికెళ్ళడానికి కూడా డబ్బులు లెవని సురేందర్ దీనంగా చెప్పినా ఆ వ్యక్తి వినకుండా ఫోన్ కట్ చేసాడట. దాంతో తన ఊరికి వెళ్ళిపోయి జానపద పాటలకు పనిచేయడం మొదలు పెట్టాడు సురేందర్. ఇక సినిమాల వైపు అతను కన్నెత్తి చూడకూడదు అని కూడా డిసైడ్ అయ్యాడట. అయినప్పటికీ అతన్ని మళ్ళీ సినీ కళామాతల్లి ఇండస్ట్రీకి రప్పించిందని అతను చెప్పుకొచ్చాడు.