ఒక సమస్యపై ఎక్కువమంది స్పందించడం వల్ల దాని తీవ్రత ఏమిటో అందరికీ అర్ధమవుతుంది. అంతేకాకుండా వివిధ స్థాయిల వారు ఆ సమస్యని ఏ కోణంలోంచి చూస్తున్నారో తెలుస్తుంది. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ గురించి నాటి, నేటి హీరోయిన్స్ విభిన్నంగా స్పందిస్తున్నారు. ప్రతి రంగంలోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉంటుంది.. అయినా ఆ సమస్యని తెలివిగా ఎదుర్కొని త్వరగా ఎదగాలని అనుభవజ్ఞులు చెప్పారు. ఎటువంటి సినీ నేపథ్యం లేక సొంత కాళ్లపై నిలబడ్డ నేటి హీరోయిన్స్ మాత్రం ఛాన్స్ లు కావాలంటే కొన్ని వదులుకోకతప్పదని నిర్మొహమాటంగా చెబుతున్నారు. ఇక సినీ కుటుంబం నుంచి వచ్చే వారి అభిప్రాయం వేరేగా ఉంది. తమకు అలంటి అనుభవం ఎదురుకాలేదంటున్నారు. ఈ సమస్యపై విశ్వనటుడు కుమార్తె శృతిహాసన్ తాజాగా స్పందించారు.
“నేను హీరోయిన్గా తెరంగేట్రం చేసి దాదాపు పదేళ్లవుతోంది. నాకు సినీ పరిశ్రమలో ఎలాంటి చేదు అనుభవాలు ఎదురు కాలేదు. సినీ పరిశ్రమలో మహిళలకు రక్షణ ఉందని నా అభిప్రాయం. అయితే కొంత మందికి లైంగిక వేధింపులు, అవమానాలు ఎదురవతున్నాయనేది మాత్రం వాస్తవం. ముందుగా మహిళలను గౌరవించడం నేర్చుకోవాలి. వారి పని పట్ల చూపుతున్న శ్రద్ధను గౌరవించాలి. ఇతర ఉద్యోగాలు చేస్తున్న మహిళలను ఎలా గౌరవిస్తున్నారో సినీ పరిశ్రమలో ఉన్న మహిళలనూ అలాగే గౌరవించాలి. సినీ పరిశ్రమలోని వారిని చిన్నచూపు చూడవద్దు” శృతి తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పింది. ఆమె చెప్పినదాంట్లో ముమ్మాటికీ వాస్తవం ఉందని, సినీ రంగంలోని మహిళల పట్ల ఆలోచన ధోరణి మారితే చాలావరకు సమస్య తగ్గిపోతుందని సినీ పండితులు భావిస్తున్నారు.