ఒక్కోసారి దర్శకనిర్మాతలు తమకు తెలియకుండానే కొన్ని సినిమాల కోసం కాస్త ఎక్కువ సమయం కేటాయించేస్తుంటారు. సినిమా హిట్ అయితే వారు కేటాయించిన టైమ్ కి సరైన వేల్యూ లభిస్తుంది. ఏమాత్రం తేడా కొట్టినా “ఈమాత్రం దానికి అంతలా కష్టపడాలా?” అంటూ జనాలు వెటకారం చేయడం ఖాయం. ఇప్పుడిదంతా చెప్పడానికి కారణం ఏంటంటే.. గత కొన్నేళ్లుగా సినిమాలకూ దూరంగా ఉంటున్న సిద్దార్ధ్ ఎప్పుడు మొదలెట్టాడో, ఎప్పుడు పూర్తయ్యిందో కూడా తెలియకుండా “గృహం” అనే సినిమాని పూర్తి చేసి ట్రైలర్ ను రిలీజ్ చేశాడు. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లోనూ విడుదలవుతున్న ఈ చిత్రం ద్వారా మిళింద్ రావ్ దర్శకుడిగా పరిచయమవుతుండగా.. ఆండ్రియా కథానాయికగా నటిస్తోంది.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొంటుండగా.. రీసెంట్ గా తమిళ మీడియాతో సినిమా గురించి సిద్ధార్డ్ చెప్పిన సంగతులు ఆసక్తి రేకెత్తించాయి. చెన్నైలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ను బేస్ చేసుకొని కథ రాసుకొన్నాను అని చెప్పిన సిద్దార్ధ్.. ఈ కథ కోసం దాదాపు నాలుగున్నరేళ్లు వెచ్చించాడట. ఈ నాలుగున్నరేళ్లలో దర్శకుడు మిళింద్ తో కలిసి చాలా అద్భుతమైన స్క్రీన్ ప్లే రాసుకొన్నాని.. ఆడియన్స్ ను “గృహం” విశేషంగా భయపెడుతుందని అందులో ఏమాత్రం సందేహంలేదని చాలా నమ్మకంగా చెబుతున్నాడు. మరి సిద్దార్ధ్ నమ్మకం ఏమేరకు నిజమవుతుందో తెలియాలంటే నవంబర్ 3 వరకూ ఆగాల్సిందే.