ఫ్లాష్ న్యూస్: విషాదంలో భారతీయ చిత్ర పరిశ్రమ… ఎస్పీ బాలు మృతి
September 25, 2020 / 01:46 PM IST
|Follow Us
గానగంధర్వుడి గళం మూగబోయింది. ప్రేక్షకలోకం పుట్టెడు దుఃఖంలో మునిగింది. సంగీత సరస్సు ఓ ఆణిముత్యాన్ని ఆకాశానికి పంపింది. భారతీయ సినిమా ప్రపంచం ఒక శిఖరాన్ని కోల్పోయింది. ఎన్నో వేల పాటలు అందించిన స్వరం ఇక వినిపించను అంది. బాలుడి గానం కొత్తగా వినలేమని శ్రోతలంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రేక్షకలోకం ముద్దుగా ఎస్పీ బాలు అని పిలుచుకునే తిరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు. సంగీతాన్ని, స్వరాలను విడిచి స్వర్గానికి వెళ్ళిపోయారు. భౌతికంగా చిత్రసీమకు సెలవు చెబుతూ, ప్రేక్షక లోకాన్ని ఒంటరి చేశారు. ఈ రోజు ఒంటి గంట నాలుగు నిమిషాలకు ఆయన మరణించినట్లు దర్శకుడు వెంకట్ ప్రభు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో జూన్ 4,1946 సంవత్సరంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం జన్మించారు. ఆయన తండ్రి ఎస్పి సాంబమూర్తి హరికథలు చెప్పేవారు. అలాగే నాటకాలు కూడా వేశారు. ఎస్పీ బాలుకి ఇద్దరు సోదరులు. ఐదుగురు సోదరీమణులు. ఐదుగురిలో ఒకరు ఎస్.పి.శైలజ గాయకురాలిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ కూడా గాయకుడే. ఆయన భార్య పేరు సావిత్రి. కుమార్తె పేరు పల్లవి. బాల్యం నుంచి సంగీతంపై ఎస్పీ బాలుకి ఆసక్తి ఏర్పడింది. చిన్నతనంలో సంగీత విభావరి పోటీలలో ఆయన పతకాలు గెలుచుకున్నారు. తండ్రి రాసిన పాటలకు బాణీలు కట్టడం అలవరచుకున్నారు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాయకుడు మాత్రమే కాదు… నటుడు, నిర్మాత, డబ్బింగ్ ఆర్టిస్ట్, అన్నిటికంటే ముఖ్యంగా సంగీత దర్శకుడు కూడా! తెలుగు, తమిళం, కన్నడ భాషలలో సుమారు 60 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. ‘శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న’ ఈ సినిమాతో ఎస్పీ బాలు వెండితెరపై గాయకుడిగా ప్రయాణం ప్రారంభించారు. ఆయనకు సంగీత దర్శకులు కోదండపాణి తొలి అవకాశం ఇచ్చారు. ‘మన్మధ లీలలు’ సినిమాలో ఒక ముసలి పాత్రకు డబ్బింగ్ చెప్పడం ద్వారా డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యారు. ‘కన్యాకుమారి’ చిత్రంతో సంగీత దర్శకుడిగా మారారు. ‘మహమ్మద్ బిన్ తుగ్లక్’తో నటుడిగా వెండి తెర పైకి వచ్చారు.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సహా 16 భారతీయ భాషలలో 40 వేలకు పైగా పాటలను ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించారు. అత్యధిక పాటలు పాడిన గాయకుడు గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కారు. ఉత్తమ గాయకుడిగా ఆరుసార్లు జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పురస్కారాలను పాతిక సార్లు అందుకున్నారు. ఎస్పీ బాలుని 2001లో పద్మశ్రీ పురస్కారం, 2011లో పద్మభూషణ్ పురస్కారంతో భారత ప్రభుత్వం సత్కరించింది.