హీరోయిన్స్ పై విరుచుకుపడ్డ (మా) అధ్యక్షుడు శివాజీ రాజా
February 13, 2018 / 11:09 AM IST
|Follow Us
సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని తపించే వ్యక్తి శివాజీ రాజా. అందుకే అతన్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడుగా ఎన్నుకున్నారు. సినిమాల్లో నటిస్తూనే ‘మా’ తరుపున సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే ఈ అసోసియేషన్ కి సొంత భవనం ఉండాలనే ఆశయంతో ఏప్రిల్ 28న అమెరికాలోని డల్లాస్‌లో “మా” సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించబోతున్నారు. ఆ విషయాన్ని అందరికీ తెలిపేందుకు ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివాజీ రాజా మాట్లాడుతూ.. “అసోసియేషన్‌కు ఎల్లప్పుడూ సహకరిస్తున్న చిరంజీవి, మహేశ్‌బాబు, బాలకృష్ణ, మోహన్‌బాబు, వెంకటేష్, నాగార్జున తదితరులకు ధన్యవాదాలు. అసోసియేషన్‌కు విరాళాలు ఇచ్చి సహకరించేందుకు ఎందరో పేరున్న హీరోలు ముందుకొస్తున్నా హీరోయిన్లు మాత్రం పట్టించుకోవడంలేదు” అని శివాజీ రాజా ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంకా హీరోయిన్స్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. “‘మా’కు సహకరించడమ్మా అంటూ హీరోయిన్లను బతిమాలుతూనే ఉన్నాం. ఇద్దరు, ముగ్గరు హీరోయిన్లు సాయం చేస్తున్నారు. మరికొందరు మేనేజర్ల మీదకి తోసేస్తున్నారు. మిమ్మల్ని డబ్బులు అడగడంలేదు. కార్యక్రమానికి వస్తే మేమే ఇస్తామంటున్నాం. కాకపోతే మీరు అడిగినంత ఇవ్వలేకపోవచ్చు. ‘మా’ అసోసియేషన్‌కు మీరు సహకరిస్తే మీ ఫొటోలను గోడలపై పెట్టుకుంటాం. మీకూ తగిన గుర్తింపు తీసుకొస్తాం. మీరు తోక జాడిస్తే మాత్రం నిర్దాక్షిణ్యంగా కత్తిరిస్తాం. ‘మా’కు సాయం చేయని మీరు మాకు అక్కర్లేదు” అని హెచ్చరించారు. ఎప్పుడూ శాంతంగా మాట్లాడే శివాజీ రాజా తొలిసారి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇదే టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది. ఇప్పుడైనా తారలు దిగివస్తారేమో చూడాలి.