One Nation:ఎన్నికలు… ఈ సినిమా ఎంతవరకు ఫలితం చూపిస్తుందో?
October 27, 2023 / 09:00 PM IST
|Follow Us
రాజకీయ నాయకులు ప్రజలకు చెప్పాల్సిన విషయాలను సినిమాల ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. కొందరు ఇన్‌డైరెక్ట్‌గా ఈ ప్లాన్ వేస్తే.. ఇంకొందరు డైరెక్ట్‌గా సినిమా తీసేసి తమ ఆలోచన చెప్పేస్తుంటారు. గతంలో ఇలా చేసిన ప్రయత్నాల్లో చాలావరకు బెడిసికొట్టేశాయి. అయితే హిట్ అయినవి మాత్రం ఆ రాజకీయ పార్టీకి బీభత్సంగా కలిసొచ్చాయి కూడా. ఇప్పుడు ఇదే కోవలో ఓ సినిమా సిద్ధమవుతోంది. మరి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీకి సంబంధించిన ఓ సినిమా ఇప్పుడు సిద్ధమవుతోంది.
వచ్చే ఏడాది తొలి నెలల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. వాటిని లక్ష్యంగా చేసుకునే బీజేపీ అనుబంధ వ్యక్తులు ఈ సినిమా తీయడానికి సిద్ధమవుతున్నారు. వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోనున్న రాష్ట్రీయ స్వయం సేవక్ (RSS) మీద ఓ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్స్ చేశారు. అమలుపరిచేశారు కూడా. బీజేపీకి ఆర్ఎస్ఎస్ మాతృ సంస్థ అనే విషయం తెలిసిందే. దాని గురించి చెప్పడానికే ‘వన్ నేషన్’ (One Nation) పేరుతో భారీ బడ్జెట్‌తో సినిమాను రూపొందిస్తున్నారు.
దీని కోసం ఆరుగురు జాతీయ అవార్డు విజేతలైన దర్శకులను తీసుకున్నారు. అందులో మలయాళ దిగ్గజ దర్శకుడు ప్రియదర్శన్, ‘కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, డాక్టర్ చంద్రప్రకాష్ ద్వివేది, జాన్ మాథ్యూ మదన్, మంజు బోరా, సంజయ్ పూరణ్ సింగ్ చౌహాన్ ఉన్నారు. ఈ సినిమాను ఆంథాలజీ తరహాలో తెరకెక్కిస్తున్నారని అంటున్నారు. అందుకే ఇంతమంది దర్శకులను ఎంపిక చేసుకున్నారట. అయితే సరిగ్గా ఎన్నికల ముంగిట ఈ సినిమా అనేసరికి ఈ సినిమా రాజకీయ ప్రయోజనం కోసమే తెరకెక్కిస్తున్నారు అనే మాట వినిపిస్తోంది.
మరి నిజంగానే అందుకేనా తీస్తున్నారా? లేదా? అంటే దానికి సమాధానం ఎవరూ చెప్పరు అనే అనొచ్చు. ఇక సినిమాలో ఏం చూపిస్తారు అనేది మరో ప్రశ్న. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా సినిమాలు వచ్చాయి. అయితే వాటికి సరైన ఆదరణ దక్కలేదు. మరి ఆర్ఎస్ఎస్ సినిమా ఏమవుతుందో చూడాలి.