బాలకృష్ణ సినిమా మీదకు దండెత్తుకొస్తున్న చిన్న సినిమాలు
February 21, 2019 / 06:50 PM IST
|Follow Us
ఒక అగ్ర కథానాయకుడి చిత్రం విడుదలవుతుందంటే.. ఆ సినిమా విడుదలకు ఒక వారం ముందు, విడుదలైన రెండు వారాల తర్వాత మరో సినిమాను అది పెద్దదైనా కావచ్చు, చిన్నదైనా కావచ్చు (పండుగ సీజన్ మినహా) విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు జంకుతారు. అలాంటిది నందమూరి బాలకృష్ణ లాంటి అగ్ర కథానాయకుడు తన తండ్రి ఎన్టీఆర్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన “ఎన్టీఆర్ మహానాయకుడు” రేపు విడుదలవుతుండగా.. మూడు చిన్న స్ట్రయిట్ సినిమాలు, ఒక డబ్బింగ్ సినిమా కూడా అదే రోజున విడుదలకు సిద్ధమవుతుండడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
ప్రస్తుతం క్రేజీ కామెడియన్స్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్న రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలు కలిసి నటించిన “మిఠాయ్”, నయనతార కథానాయకిగా నటించిన ఓ తమిళ చిత్రాన్ని “అంజలి సి.బి.ఐ”గా అనువదించి విడుదల చేస్తున్న మరో చిత్రంతోపాటు.. “4 లెటర్స్, ప్రేమేంట పని చేసే నారాయణ” అనే రెండు చిన్న సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. ఈ సినిమాలకు కలెక్షన్స్ వస్తాయా, అసలు హిట్ అవుతాయా లేదా అనే విషయం పక్కన పెడితే.. బాలయ్య సినిమాతోపాటు ఇవి కూడా విడుదలవుతుండడం మాత్రం చర్చనీయాంశం అయ్యింది. ఫస్ట్ పార్ట్ ఫెయిల్ అవ్వడమే ఇందుకు కారణమని కొందరు పేర్కొంటుండగా.. సెకండ్ పార్ట్ కి పెద్దగా క్రేజ్ లేకపోవడమేనని ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు.