ఇటీవల ‘పొన్నియిన్ సెల్వన్2’లో కనిపించి అలరించింది శోభితా ధూళిపాళ్ల. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది. ‘మేడ్ ఇన్ హెవెన్ 2’లో తార పాత్రతో అలరించిన ఈ నాయిక ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలపై మాట్లాడింది. ‘ఎప్పుడూ తెరపై కనిపించాలి. నాకు చేతి నిండా పని ఉండాలి.. అనే ఉద్దేశంతో వచ్చిన ప్రతి పాత్రనీ ఒప్పుకోను. నాకంటూ కొన్ని అభిరుచులు, ఇష్టాలు ఉన్నాయి. వాటికి అనుగుణంగానే వచ్చిన అవకాశాల్లోంచి పాత్రలు ఎంచుకుంటాను.
‘పాత్రల ఎంపికే తప్ప.. అవకాశాలనేవి మన చేతిలో ఉండవు. అలా జరిగితే.. కరణ్ జోహార్, ఫరాఖాన్లాంటి గొప్ప దర్శకులతో కలిసి పని చేస్తాను. ఆ అవకాశం లేకపోవడంతో ఒప్పుకున్న సినిమాల్నే వందశాతం మనసు పెట్టి చేస్తాను.కమర్షియల్గా విజయవంతమైన దర్శకురాలు జోయా అక్తర్ ‘మేడ్ ఇన్ హెవెన్ 2’లో ప్రధాన పాత్ర నాకివ్వడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. అలాగే మణిరత్నం సర్ ‘పొన్నియిన్ సెల్వన్’లో మంచి ప్రాధాన్యం ఉన్న వాణతి పాత్రనిచ్చారు. నాలో (Sobhita Dhulipala) ఉన్న ప్రతిభ గుర్తించే ఈ అవకాశం ఇచ్చారనుకుంటున్నాను.
ఆ రెండు పాత్రలూ వేటికవే ప్రత్యేకం. ఆధునికత, మనో నిబ్బరం, నైతిక విలువలు, హడావుడి చేసే మనస్తత్వం.. ‘మేడ్ ఇన్ హెవెన్ 2’ లోని తార పాత్ర నా జీవితానికి దగ్గరగా ఉంటుంది. మూడేళ్లుగా నేను తెలుగు, హిందీ, మలయాళ, తమిళ భాషల్లో భిన్నమైన పాత్రలు పోషించా. నా పనితీరు దర్శకనిర్మాతలతోపాటు ప్రేక్షకులకు నచ్చిందనే భావిస్తున్నాను.
నేను సరైన మార్గంలోనే ప్రయాణిస్తున్నాను కాబట్టే వాళ్లు నన్ను మళ్లీ ఆదరిస్తున్నారు. వాళ్ల అభిమానమే నన్ను మరిన్ని మంచి పాత్రలు ఎంచుకునేలా చేస్తోంది’ అటూ చెప్పుకొచ్చింది శోభితా.