Sonu Sood: నెటిజన్ల సందేహాలపై క్లారిటీ ఇచ్చిన సోనూ!
May 26, 2021 / 11:50 AM IST
|Follow Us
కరోనా సమయంలో ప్రజలందరికీ తన సేవలందించి రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. వలస కార్మికులకు సొంతూళ్లకు చేర్చడం, యువతకు ఉద్యోగాలు ఇప్పించడం, పేదలను ఆదుకోవడం ఇలా ఒకటా, రెండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాడు. కరోనా సెకండ్ వేవ్ టైమ్ లో తన సేవలను మరింత విస్తరించాడు. ప్రజలు ప్రభుత్వాలను సాయం అడగడం మానేసి సోనూసూద్ ని వేడుకుంటున్నారు. సోనూ కూడా సాధ్యమైనంత మందికి సాయం అందించేలా ప్రయత్నిస్తున్నాడు. ఏపీలో ఏకంగా ఆక్సిజన్ ప్లాంట్ లు ఏర్పాటు చేస్తున్నాడు.
అయితే ఇంతమందిని ఆదుకోవడానికి, ఇన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడానికి సోనూ దగ్గర అంత డబ్బు ఎలా వస్తుందని చాలా మందికి సందేహాలు కలుగుతున్నాయి. ట్విట్టర్ లో కొందరు సోనూని ట్యాగ్ చేస్తూ మరి ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. తాజాగా ఓ ఇంటర్నేషనల్ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాడు సోనూ. తాను గతేడాది చేసిన సేవా కార్యక్రమాలు చూసి చాలా మంది స్ఫూర్తి పొందారని.. వారిలో చాలా మంది తనను సంప్రదించారని.. తాము కూడా ఇందులో భాగస్వాములమవుతామని చెప్పారని సోనూ వెల్లడించాడు.
తన మీద నమ్మకంతో విరాళాలు ఇవ్వడంతో పాటు అనేక రకాలుగా సేవలో భాగం అవుతున్నారని సోనూ చెప్పాడు. తన దగ్గరున్న డబ్బుకి ఈ విరాళాలు కూడా జోడించి సోనూసూద్ ఫౌండేషన్ ద్వారా ఈ పనులన్నీ చేయగలుగుతున్నానని.. సోనూ వెల్లడించాడు. కేవలం కరోనా బాధితుల్ని ఆడుకోవడంతో తాను ఆగిపోవడం లేదని.. లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారిని ఆదుకునేందుకు భారీ ప్రణాళికలు రచించామని చెబుతున్నాడు. కంపెనీల భాగస్వామ్యంతో ఇప్పటికే రెండు లక్షల మందికి ఉపాధి కల్పించామని చెప్పారు.