Sonu Sood statue: సోనూసూద్ కు గుడి, పూజలు.. ఎక్కడో తెలుసా?
October 7, 2021 / 07:33 PM IST
|Follow Us
సోనూసూద్… గడిచిన ఏడాదిన్నరగా ఈయన వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నాడు. లాక్డౌన్ కారణంగా ఎక్కడికక్కడ చిక్కుకు పోయిన కార్మికులను వాళ్లను గమ్యస్థానాలకు వెళ్లేలా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసాడు. కొంత మందిని ఏకంగా ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి ప్రభుత్వాలు సైతం చేయలేని సాయాన్ని చేసి రియల్ హీరోగా ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు. ఆ తర్వాత కూడా అవసరమైన వారికి సాయం చేస్తూ తన పెద్ద మనసును చాటుకుంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో దేశవ్యాప్తంగా పలు ఆక్సిజన్ ప్లాంట్లను నిర్మించి ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్న ఆయనకు ఊరారా అభిమాన సంఘాలు కూడా ఏర్పడుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి సోనూసూద్‌కి గుడి కట్టి పూజిస్తున్నాడు. ఎవరా వ్యక్తి అతనికి సోనూ మీద అంత అభిమానం ఎందుకో ఒకసారి చూస్తే.. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గార్లపాడు గ్రామానికి చెందిన గుర్రం వెంకటేశ్ ఆర్ధిక పరిస్ధితి అంతంత మాత్రం. అయితే కరోనా కాలంలో సోనూసూద్ చేసిన సామాజిక సేవకు వెంకటేశ్ ఫిదా అయ్యాడు. ప్రభుత్వాలే పట్టించుకోకుండా వున్న వేళ.. తన సొంత ఖర్చుతో సోనూసూద్ చేసిన పనుల గురించి గ్రామస్తులు చెప్పగా వెంకటేశ్‌ను ఆకట్టుకుంది.
ఎంతోమందికి దేవుడిగా నిలిచిన సోనూసూద్‌కు గుడి కట్టి పూజించినా తప్పులేదని మనస్సులోనే అనుకున్నాడు. ఆ వెంటనే తన ఆలోచనకు కార్యరూపం ఇచ్చాడు. విజయవాడ దగ్గరలో గల గొల్లపూడి లో విగ్రహాన్ని తయారు చేయించి అక్కడ నుండి ఆటో లో విగ్రహాన్ని తన సొంత గ్రామానికి తీసుకువచ్చాడు. వెంకటేష్‌కు వచ్చిన ఆలోచనకి సంతోషించిన గ్రామస్తులందరూ అతనిని అభినందించారు. విగ్రహావిష్కరణకు గ్రాండ్ లెవల్లో ప్లాన్ చేస్తున్న వెంకటేశ్.. ఇందుకు తన దేవుడు సోనూసూద్‌ను ఆహ్వానించాలని నిర్ణయించుకున్నాడు. మరి ఈ భక్తుడి కోరికను సోనూసూద్ మన్నిస్తాడో లేదో వేచిచూడాలి.