క్రికెటర్ల జీవిత కథలను సినిమాగా తీయడం బాలీవుడ్‌కి కొత్తేం కాదు. ఇప్పటికే సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ లాంటి స్టార్ క్రికెటర్ల కథలు వెండితెరకెక్కాయి. ప్రస్తుతం కపిల్ దేవ్ టీమ్ కథ ‘83’గా రాబోతోంది. అయితే మరో స్టార్ క్రికెటర్ కథ బాలీవుడ్లో రూపొందించడానికి సిద్ధమవుతున్నారట. అదే టీమిండియా ‘దాదా’ సౌరభ్ గంగూలీ. అవును బీసీసీఐ అధ్యక్షుడి జీవితాన్ని సినిమా చూపించబోతున్నారట. భారత క్రికెట్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు సౌరభ్ గంగూలీ.
ట్రెడిషనల్‌గా సాగిపోతున్న భారతీయ క్రికెట్లోకి యాటిట్యూడ్, జోష్ తీసుకొచ్చింది గంగూలీనే అని చెప్పాలి. అలాంటి గంగూలీ జీవితాన్నిసినిమాగా తీస్తారట. అందులో హీరోగా రణ్‌బీర్ కపూర్‌ను హీరోగా తీసుకునే ప్రయత్నాలు సాగుతాయట. జీవిత కథలు అంటే రణ్‌బీర్ ఎలా ఒదిగిపోతాడో మొన్నీ మధ్యే ‘సంజూ’లో చూశాం. ఇప్పుడు మరోసారి చూడొచ్చన్నమాట. ధోనీ జీవిత కథ అనేసరికి… అతని లైఫ్‌లో అన్ని కోణాల్ని చూపించారు. ఇప్పుడు దాదా జీవిత కథను కూడానా అలానే చూపిస్తారా అనేది చూడాల్సి ఉంది.
ఎందుకంటే దాదా జీవితంలో చాలా కోణాలు ఉన్నాయి. అవన్నీ ఫక్తు బాలీవుడ్ సినిమా కథకు దగ్గరగానే ఉంటాయి. ఎలాగూ ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రూపొందనుంది కాబట్టి… మనం కూడా ఎంచక్కా తెలుగులో చూడొచ్చన్నమాట.