Sr NTR, Krishna: ఒకే తరహా కథతో సినిమాలు తీసిన ఎన్టీఆర్-కృష్ణ!
July 18, 2023 / 08:04 PM IST
|Follow Us
ఒకే కథ, ఒకటే టైటిల్‌తో పోటాపోటీగా తయారై విడుదలైన చిత్రాలు తెలుగు సినిమా చరిత్రలో కొన్ని ఉన్నాయి. అయితే ఒక కథతో ఒక చిత్రం తయారై విడుదలైన తర్వాత దాదాపు అదే పోలికలతో మరో చిత్రం తయారవడం అరుదుగా జరిగే సంఘటన. నటరత్న ఎన్టీఆర్, నటశేఖర కృష్ణ విషయంలో ఇలా జరగడం ఆసక్తికలిగించే అంశం. కృష్ణ, శ్రీదేవి జంటగా నటించిన చిత్రం ‘ప్రేమనక్షత్రం’. అదే పేరుతో కొమ్మూరి వేణుగోపాలరావు రాసిన నవల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకొంది.
ఈ నవల ‘ఆంధ్రజ్యోతి వార పత్రిక’లో సీరియల్‌గా వచ్చింది. నవలలో పెద్దగా మార్పులు చేయకుండా దాదాపు అవే సంఘటనలతో సినిమాగా మలిచారు దర్శకుడు పర్వతనేని సాంబశివరావు. సహ నటుడు విజయ్‌కుమార్‌ను పెళ్లి చేసుకుని నటనకు తాత్కాలికంగా విరామం ఇచ్చిన నటి మంజుల మళ్లీ ఈ చిత్రంతోనే రీ ఎంట్రీ ఇచ్చారు. హాస్య నటుడు సుధాకర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు.
తన కంపెనీలో పని చేసే ఉద్యోగుల మధ్య ప్రేమ, పెళ్లి అనే మాటలు వినిపించకుండా జాగ్రత్తలు తీసుకునే మిలటరీ మాజీ అధికారిగా రావు గోపాలరావు నటించారు. 1982 ఆగస్టు 6న ‘ప్రేమనక్షత్రం’ చిత్రం విడుదల అయింది. ఈ సినిమా రిలీజ్ అయిన ఆరు నెలలకు ఎన్టీఆర్, బాలకృష్ణ హీరోలుగా నటించిన ‘సింహం నవ్వింది’ విడుదల అయింది. ఈ సినిమాకు యోగానంద్ దర్శకుడు. ఇది ఎన్టీఆర్ (Sr NTR) సొంత చిత్రం. అప్పటికే ఆయన ఎన్నికల్లో గెలిచి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
‘ప్రేమనక్షత్రం’ కథకు, ‘సింహం నవ్వింది’ కథకు కొన్ని పోలికలు కనిపిస్తాయి. రెండు సినిమాల్లోనూ ఆఫీస్ బాస్ ప్రేమకు, పెళ్లికి వ్యతిరేకి. కాకపోతే ‘సింహం నవ్వింది’ చిత్రకథ ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతుంది. ఫ్లాష్ బ్యాక్‌లో ఆయనకు ఓ హీరోయిన్, పాట ఉంటాయి. ఆ హీరోయిన్ పాత్రను ప్రభ పోషించారు. బాలకృష్ణ సరసన కళారంజని నటించారు. ఈ రెండు చిత్రాలూ మక్కీకి మక్కీ కాపీ అని చెప్పలేం కానీ ‘సింహం నవ్వింది’ చిత్రం చూస్తుంటే ప్రేమనక్షత్రం గుర్తుకు వస్తుంది.