Srinivas Avasarala: మంచి టాక్ వచ్చినా క్యాష్ చేసుకోలేకపోయిన ‘అందగాడు’..!
September 6, 2021 / 06:55 PM IST
|Follow Us
అవసరాల శ్రీనివాస్.. ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఫ్యాక్టరీ నుండీ ఊడిపడ్డ మేకర్. సహాయ నటుడిగా,విలన్ గా, కమెడియన్ గా, దర్శకుడిగా మాత్రమే కాదు సెకండ్ హీరోగా కూడా ప్రేక్షకులను అలరించాడు. ‘అష్టా చమ్మా’ ‘అ!’ ‘అమీ తుమీ’ వంటి చిత్రాల్లో ఇతను సెకండ్ హీరోగా నటించడం జరిగింది.అవి హిట్ అయ్యాయి కూడా..! ‘బాబు బాగా బిజీ’ అనే సినిమాలో హీరోగా కూడా నటించాడు.అది యావరేజ్ గా ఆడింది.మంచి పాయింట్ ను తీసుకుని దాని మంచి కథగా మలచగల సమర్ధుడు అవసరాల.
సరిగ్గా అలాగే ‘నూటొక్క జిల్లాల అందగాడు’ సినిమాతో సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రచ్చకొండ విద్యాసాగర్ ఈ చిత్రానికి దర్శకుడు అయినప్పటికీ ఈ కథకి అవసరాల రచనా సహకారం చాలానే ఉంది. సెప్టెంబర్ 3న విడుదలైన ఈ చిత్రానికి మంచి టాకే వచ్చింది.అవసరాల కామెడీ టైమింగ్ కు కూడా మంచి మార్కులే పడ్డాయి. కానీ సినిమాకి కలెక్షన్లు మాత్రం నమోదు కావడం లేదు. ఈ వీకెండ్ మొత్తం కలిపి కేవలం రూ 0.34 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.
ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావడానికి కనీసం రూ.2 కోట్ల షేర్ ను రాబట్టాలి. కానీ అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఎడతెగకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనాలు థియేటర్లకు రాకపోవడం అసలు కారణం అనుకుందాం అంటే.. గత వారం రిలీజ్ అయిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఈ వీకెండ్ ఈ సినిమాకంటే బెటర్ గా పెర్ఫార్మ్ చేసింది. అవసరాల కనీసం ఏడాదికి ఒక సినిమాలో అయినా హీరోగా చేస్తే బెటర్. లేదంటే.. మంచి సినిమాలు తీసిన ప్రతీసారి ఇలాంటి ఫలితాలే మూటకట్టుకోవాల్సి వస్తుంది.