సినిమా ఒక్కటే జీవితం కాదుగా… ఏ హీరో చెప్పని మాట ఇది!
February 4, 2024 / 11:47 AM IST
|Follow Us
సినిమానే జీవితం… నా జీవితం మొత్తం సినిమానే ఉంది! ఇలాంటి మాటలు మనం సినిమా జనాల నుండి తరచుగా వింటూ ఉంటాం. నిజానికి కొంతమంది అలా ఉంటారు కూడా. తమ జీవితంలో సినిమా తప్ప ఇంకా ఏమీ లేదు అని తమ మాటలతో, చేష్టలతో చెబుతుంటారు. నిజంగా అలానే బతుకుతారా అంటే అది వేరే సంగతి. అయితే ఓ స్టార్ హీరో మాత్రం తన జీవితం అంటే సినిమా మాత్రమే కాదు కదా.. అంటూ రియాలిటీకి దగ్గరగా మాట్లాడి వావ్ అనిపించారు.
ఈ మాట అన్నది ఎవరో కాదు ఇటీవల ‘ఫైటర్’ సినిమాతో బాలీవుడ్‌ని పలకరించి హృతిక్ రోషన్. యాక్షన్ సినిమాల హీరోగా హృతిక్ బాలీవుడ్‌కే కాదు, టాలీవుడ్‌కి కూడా పరిచయమే. అయితే 24 ఏళ్ల అతని కెరీర్లో కేవలం 26 చిత్రాలే చేశాడు. ‘అంత సుదీర్ఘ కెరీర్లో తక్కువ సినిమాలా?’ అంటూ మీరు ఆశ్చర్యంగా అనుకోవచ్చు. కానీ ఇది నిజం. ఆయన చేసిన సినిమాలు అన్నే. అలా ఎందుకు అని అడిగితే ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.
జీవితమంటే సినిమాలు మాత్రమే కాదుగా! కుటుంబం, పిల్లలు, ఇతర వ్యాపకాలు ఉంటాయి అంటూ తన కెరీర్, లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటున్న విధానాన్ని చెప్పాడు హృతిక్. పై విషయాలతోపాటు తనకు ప్రశాంతత కావాలని, ఎప్పుడూ బిజీగా ఉండకుండా ప్రశాంతంగా జీవించాలనేది తన ఆలోచనని చెప్పాడు. చేసే పనిని ఆస్వాదిస్తూ ఉండాలి, అలాగే ఆదరాబాదరాగా ఏది పడితే అది చేసేయడం నచ్చదు అని (Hrithik Roshan) చెప్పాడు.
ఒక సినిమాను ఓకే చేస్తే దాని కోసం వంద శాతం మనసు పెట్టి కష్టపడటం తన నైజమని, కెరీర్లో చేసిన ప్రతి సినిమా అలానే చేశానని చెప్పాడు. సినిమాలు లేనప్పుడు చేసే పనులు.. వన్స్ సినిమా షూట్ స్టార్ట్ అయితే చేయనని చెప్పాడు. రీసెంట్ సినిమా ‘ఫైటర్’ చిత్రీకరణ మొదలయ్యాక సోషల్ మీడియాను పూర్తిగా దూరం పెట్టేశాడట. ఏడాదిపాటు స్నేహితుల్ని కూడా కలవలేదట. రోజూ తొమ్మిదిగంటలకే నిద్ర పోయేవాడట. సినిమాపై, ఆ పాత్రపై దృష్టి పెట్టడానికే ఆ నియమాలు పెట్టుకున్నా అని చెప్పాడు.