షూటింగ్స్ బంద్‌పై సీనియర్ నిర్మాత షాకింగ్ కామెంట్స్!
December 9, 2022 / 04:03 PM IST
|Follow Us
టాలీవుడ్ సినిమా పరిశ్రమ చాలా కష్టాల్లో ఉంది. అందుకే అందరం షూటింగ్‌లు మానేసి, మీటింగ్‌లు పెట్టుకుని మాట్లాడుకుంటాం, ఒక నిర్ణయానికి వచ్చి.. అప్పుడు షూటింగ్‌లు మొదలుపెడతాం అంటూ ఆ మధ్య నిర్మాతలు అందరూ షూటింగ్‌లు ఆపేసి.. బంద్ చేశారు గుర్తుండే ఉంటుంది. దాని వల్లే ఏం సాధించారు? అంటూ ఆ మధ్య ఒకరిద్దరు నిర్మాతలు (చిన్న నిర్మాతలు లెండి) అడిగారు. ఓ పెద్ద నిర్మాత కూడా అడిగారు అనుకోండి. దానికి ఆ ‘పెద్ద’ నిర్మాతల నుండి ఎలాంటి స్పందన లేదు. అయితే ఇప్పుడు మరో సీనియర్ నిర్మాత ఇదే మాట అంటున్నారు.
నిర్మాతలు అంతా కలసి షూటింగ్ బంద్‌కి పిలుపునివ్వడాన్ని ప్రముఖ నిర్మాత కళ్యాణ్ ఒక అట్టర్ ఫ్లాఫ్ షోగా అభివర్ణించారు. ఆ నిర్మాతల నిర్ణయం వల్ల సమయం, డబ్బు వృథా తప్పిస్తే.. ఎలాంటి లాభం లేదని చెప్పుకొచ్చారు. దీంతో ఆయన కామెంట్స్ టాలీవుడ్లో వైరల్‌గా మారాయి. చిన్న సినిమా నిర్మాతకు విడుదల రోజున చాలా సమస్యలు ఉన్నాయి. వాటికి పరిష్కారం దొరుకుతుందని షూటింగ్ బంద్‌కి నాడు సమ్మతించాను. కానీ అది జరిగే పని కాదని తొలి మీటింగ్స్‌లోనే అర్థమైపోయింది అని సి.కల్యాణ్ అన్నారు.
మొదటి నాలుగు మీటింగ్స్‌లో నాకు విషయం బోధపడింది. ఈ బంద్, మీటింగ్‌ల వల్ల ఏమీ జరగదని అర్థమైపోయింది. అయితే ఈ మీటింగ్స్ పెట్టుకుని కొన్ని సమస్యలు, లోపాలు అయితే గుర్తించారు. వాటిని ఎలా సరిదిద్దాలి అనే విషయాల్ని కూడా చర్చించారు. అయితే అవేవీ అమలు చేయడం లేదు. ఇంకా చెప్పాలంటే ఇండస్ట్రీలోని నిర్మాతల్లో కొందరి వ్యక్తిగత లాభాల కోసం చేసుకున్న బంద్ అది ఘాటుగా కామెంట్ చేశారు సి.కల్యాణ్.
ప్రొడ్యూసర్ గిల్డ్ అనేది తమ గురించి తామే మాట్లాడుకునే ఆర్గనైజేషన్ మాత్రమే. ఆ బృందాన్ని నేను పట్టించుకోను. దీనికి అంతకు ముందు ఇంకేదో పేరు ఉంది. గిల్డ్ స్థానంలో రేపోమాపో మరో పేరు వస్తుంది. ఇండస్ట్రీలో శాశ్వతంగా ఉండబోయేది ఫిల్మ్ ఛాంబర్ మాత్రమే. సంక్రాంతికి సినిమా విడుదల విషయంలో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’ చిత్ర బృందాలు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఈ విషయంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ మాట్లాడడం తప్పు అని అన్నారు సి.కల్యాణ్.