యాక్షన్ సన్నివేశాల్లో పులిలా ముందుకు దూకడం.. గుండెలు అదిరేలా డైలాగ్ చెప్పడం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మొదటి నుంచి అలవాటు. కాస్త గ్యాప్ తర్వాత రాయలసీమ కథ దొరకాగ్గానే తారక్ రెచ్చిపోయి నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అతను చేస్తున్న “అరవింద సమేత వీర రాఘవ” టీజర్ నిన్న రిలీజ్ అయి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. మూడు గంటల్లోనే మూడు మిలియన్ డిజిటల్ వ్యూస్ అందుకొని రికార్డుల వేట మొదలు పెట్టింది. “కంటపడ్డావా కనికరిస్తానేమో.. వెంటపడ్డానో నరికేస్తావోబా..” అంటూ రాయలసీమ యాసలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. టీజర్ ప్రారంభంలో “మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటాదో తెలుసా? మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎట్టుంటాదో తెలుసా? మట్టి తుపాను చెవిలో మోగితే ఎట్టుంటాదో తెలుసా?” అని జగపతిబాబు వాయిస్ ఓవర్ అయితే వీర రాఘవ రెడ్డి క్యారక్టర్ ని ఆవిష్కరించింది. అందుకే ఈ టీజర్ యూట్యూబ్ లో 6 మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్ లో నంబర్ వన్ స్థానంలో ఉంది. ఈ టీజర్ పై అభిమానులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు గుప్పించారు.
ఎనకా ముందు చూసేదిలేదు…
పేరుకే ‘అరవింద సమేత’ నిజానికి తారక్ ఖడ్గ సమేతుడు. నరకడం మొదలుపెట్టాక ఎనకా ముందు చూసేదిలేదు అన్నట్టున్నాడు చిన్నరామయ్య. త్రివిక్రమ్, తారక్, చిత్రబృందానికి జయీభవ.
– పరుచూరి గోపాలకృష్ణ
పులిలా వేటాడుతున్నట్లు..
టీజర్లో తారక్ నిజంగానే పులిలా వేటాడుతున్నట్లు కనిపించారు. చిత్రబృందానికి శుభాకాంక్షలు. – మారుతి
కొత్త కోణం
ప్రతి సినిమాతో తనలోని కొత్త కోణాన్ని చూపిస్తున్నాడు. ‘జైలవకుశ’లో ‘జై’ పాత్ర తర్వాత ఇప్పుడు ‘వీర రాఘవ రెడ్డి’గా తారక్ దూసుకుపోతున్నాడు. – కోన వెంకట్
లైవ్ కరెంట్ తీగలా
ఈ టీజర్‌కు అద్భుతం అన్న పదం కూడా తక్కువే. తారక్ లైవ్ కరెంట్ తీగలా ఉన్నాడు. ఈ చిత్రంలో నేనూ భాగమైనందుకు సంతోషంగా ఉంది. – నరేశ్ (సీనియర్ )