Subhalekha Sudhakar: ‘శుభలేఖ’ సుధాకర్ గురించి మనకి తెలియని విషయాలు..!
August 3, 2022 / 12:24 PM IST
|Follow Us
ఇప్పుడు సినీ స్టార్స్ గా వెలుగొందుతున్న వారు ఒకప్పుడు పూట గడవటానికి కష్టపడ్డ వారే. ఎన్నో అవమానాలు, చీత్కారాలు ఎదుర్కొన్న వారే. అవన్నీ దాటుకుని వచ్చిన తర్వాతే ఈ స్టార్ డమ్ దక్కింది. అలాంటి కోవలోకే వస్తారు శుభలేక సుధాకర్. హీరోగా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో గుర్తిండిపోయే పాత్రలు చేసిన ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లో సీరియల్స్ లో బిజీగా ఉన్నారు. శుభలేక సుధాకర్ గతంలోకి వెళితే…
యాక్టర్ కావడానికి ముందు కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆయన ఓ హోటల్ లో రిసెప్షనిస్టుగా పనిచేశారు. నిజానికి సినిమాలన్నా, నాటకాలన్నా సుధాకర్ వారి కుటుంబంలో ఎవరికి నచ్చదు. కనీసం సినిమాలు కూడా చూసేవారు కాదు. కానీ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని సుధాకర్ సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో వాళ్లని ఎలాగోలా ఒప్పించి.. మద్రాస్ బండి ఎక్కేశారు. అక్కడి ప్రతిష్టాత్మక మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో నటనలో శిక్షణ తీసుకున్నారు.
మంచి ప్రతిభతో డిప్లొమా పూర్తి చేసిన సుధాకర్ తన సొంతూరికి వెళ్లిపోయారు. ఇక సినిమాల్లో ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టిన ఆయన… కళాతపస్వి కే.విశ్వనాథ్ ను కలిశారు, కానీ నిరాశే ఎదురైంది. మద్రాసులో వుంటూ సినిమాల్లో ఆఫర్ల కోసం ప్రయత్నించడమంటే అది మామూలు విషయం కాదు. అందుకే ముందు ఏదైనా ఉద్యోగం చేస్తూ ట్రై చేద్దామని సుధాకర్ భావించారు. దీనిలో భాగంగా అప్పటికే మద్రాస్ లో పెద్ద హోటల్ గా వున్న తాజ్ కోరమండల్ లో రిసెప్షనిస్ట్ ఉద్యోగం సంపాదించారు.
ఇలా ఉండగా ఎన్నో రోజుల నుంచి సుధాకర్ కంటున్న కల ఫలించింది. ఓ రోజున కే. విశ్వనాథ్ ఆఫీసు నుంచి ఆయనకు ఫోన్ వచ్చింది. చిరంజీవి హీరోగా తాను తీస్తున్న సినిమాలో సుధాకర్ కు అవకాశం ఇచ్చారు విశ్వనాథ్. అదే ‘శుభలేఖ’. తనకు సినీ జీవితాన్ని ప్రసాదించిన సినిమా పేరును వదిలిపెట్టకుండా దానినే ఇంటి పేరుగా మార్చుకున్నారు సుధాకర్.