Sudheer Babu: తొలి సినిమా నాటి మాటలు చెప్పిన సుధీర్‌బాబు!
February 10, 2022 / 03:25 PM IST
|Follow Us
సినిమా హీరో అంటే… ఇలానే ఉండాలి అనే రూల్ ఏమన్నా ఉందా? అంటే అస్సలు లేదు అని చెబుతారు. కానీ తొలినాళ్లలో ప్రతి హీరో ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కొంటూనే ఉన్నాడు. ‘నువ్వా హీరోనా?’ అనే ప్రశ్న చాలామంది హీరోలకు ఎదురయ్యే ఉంటుంది. సినిమా కుటుంబం నుండి వారసలుగా వచ్చేవాళ్లు, బంధువులకు కూడా ఈ సమస్య ఉంటుంది. అయితే ఈ మాట వాళ్లకు ఎదురుగా ఎవరూ అనరు. వెనుక మాట్లాడుకుంటారు.
అలా మహేష్‌బాబు బావ సుధీర్‌బాబుకి కూడా ఎదురైందట. ఆ విషయాన్ని ఇటీవల ఆయన వెల్లడించారు. సుధీర్‌బాబు తొలి సినిమా అంటే ‘ఎస్ఎంఎస్’ అదే ‘శివ మనసులో శ్రుతి’. ఆ సినిమా షూటింగ్ మొదటి రోజు సుధీర్‌బాబును సెట్లో చూసిన ఆ సినిమా కెమెరామెన్ తన అసిస్టెంట్లతో సుధీర్‌బాబు గురించి కామెంట్ చేశారట. హీరోది ఫొటోజెనిక్ ఫేస్ కాదు.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేడు అని అన్నారట. ఆ మాటలు విన్నప్పుడు సుధీర్‌బాబు చాలా బాధ పడ్డారట.
అది చూశాక ఏం చేయాలో ఆలోచించుకునేలా చేసిందట. ఆ మాటలు నటుడిగా నన్ను నేను నిరూపించుకోవడానికి ఇన్స్పైర్ అయ్యేలా చేశాయి. సుధీర్‌బాబు హిందీలో ‘బాఘి’ అనే సినిమాలో విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. అందులో మంచి పేరే వచ్చింది. అయితే ఆ తర్వాత అలాంటి ప్రయత్నం చేయలేదు. కానీ ఇప్పటికీ బాలీవుడ్ నుండి ఆఫర్లు వస్తున్నాయట. కానీ తెలుగు సినిమాలతో బిజీగా ఉండటం వల్ల కుదరడం లేదు అని చెప్పాడు సుధీర్‌బాబు.
యాక్షన్ చిత్రాలంటే సుధీర్‌బాబుకి చాలా ఇష్టమట. జాకీ చాన్‌కు పెద్ద అభిమాని అట.అందుకే రాబోయే రోజుల్లో యాక్షన్ సినిమాలు చేయబోతున్నా అని చెప్పాడు సుధీర్‌బాబు. ప్రస్తుతం హర్ష వర్ధన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘లూజర్ 2’ దర్శకుడు అభిలాష్ రెడ్డితో ఒక సినిమా తెరకెక్కిస్తున్నారు. వీటితో పాటు మరో రెండు సినిమాలు ఒప్పుకున్నాడట. చాలా రోజుల క్రితం ప్రకటించిన పుల్లెల గోపీచంద్ బయోపిక్ కూడా ఉంది. దాని కోసం ఓ పెద్ద నిర్మాణ సంస్థ ముందుకొచ్చింది అని చెప్పారు సుధీర్‌బాబు. అయితే ఆ సంస్థ ఏంటో తెలియాల్సి ఉంటుంది.