మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం అనేక రికార్డులను తిరగరాస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల షేర్ రాబట్టి 150 కోట్ల క్లబ్ లో చేరడానికి పరుగులు తీస్తోంది. బాహుబలి చిత్రాల తర్వాత నంబర్ వన్ సినిమాగా రంగస్థలం నిలిచింది. ఈ సినిమా విజయాన్ని చిత్రం బృందం ఆస్వాదిస్తోంది. డైరక్టర్ సుకుమార్ అయితే సంతోషంగా ఉన్నారు. రెండు నెలల పాటు విదేశాల్లో విహరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన అతను విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానమిచ్చారు. “ఇప్పుడు వన్ లైన్ పంచ్ డైలాగులు రాయడం తెలుగు పరిశ్రమలో ట్రెండ్ అయింది కదా..
మీరెందుకు అలా డైలాగులు రాయడం లేదు” అని అడగగా.. సుకుమార్ ఇలా స్పందించారు. “అలాంటి డైలాగులు రాయడం నాకు ఇష్టముండదు. నాపైన కృష్ణవంశీ, రామ్ గోపాల్ వర్మల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వారి రాసిన విధంగానే నేను ఆలోచిస్తుంటాను. నా అసోసియేట్ డైరక్టర్స్ కూడా పంచ్ లు ఉండాలని అడుగుతుంటారు. అయితే అది నా స్టైల్ కాదు. అందుకే రాయను” అని స్పష్టం చేశారు. అలా పంచ్ లు కోసం ఆలోచిస్తూ కూర్చుంటే కథలో ఫీల్ పోతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాను నమ్మిన విధానంలోనే వెళ్తూ ఇండస్ట్రీ హిట్ కొట్టారు.