Sundaram Master Review in Telugu: సుందరం మాస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
February 23, 2024 / 12:44 PM IST
|Follow Us
Cast & Crew
హర్ష చెముడు (Hero)
దివ్య శ్రీపాద, (Heroine)
చైతు బాబు తదితరులు.. (Cast)
కళ్యాణ్ సంతోష్ (Director)
రవితేజ - సుధీర్ కుమార్ కుర్రా (Producer)
శ్రీచరణ్ పాకాల (Music)
దీపక్ యరగెర (Cinematography)
యూట్యూబర్ గా కెరీర్ మొదలుపెట్టి, కమెడియన్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్న హర్ష చెముడు హీరోగా పరిచయమవుతూ నటించిన చిత్రం “సుందరం మాస్టర్”. మాస్ మహారాజా రవితేజ నిర్మాణ సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం నేడు (ఫిబ్రవరి 23) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!
కథ: తన గురించి తప్ప ఎదుటివారి గురించి ఏమాత్రం ఆలోచించని స్వార్ధపరుడు సుందర్ రావు (హర్ష). ఉద్యోగాన్ని కట్నంతో లింక్ చేసి భారీగా సొమ్ము చేసుకోవాలనుకుంటాడు. అదే సమయంలో లోకల్ ఎమ్మెల్యే సుందరాన్ని పావుగా వాడుకొని ఓ గిరిజన తెగకు చెందిన అమూల్యమైన సంపదను దోచుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో మిరియాలమిట్ట చేరుకుంటాడు సుందర్ రావు.
బ్రిటిషర్ల ద్వారా ఎప్పటినుండో ఇంగ్లీష్ నేర్చుకొని.. ఫారినర్స్ స్థాయిలో ఇంగ్లీష్ మాట్లాడే మిరియాలమెట్ట ప్రజలతో సుందర్ ఎలా వేగాడు? ఆ గ్రామంలో ఉన్న అమూల్యమైన సంపద ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానమే “సుందరం మాస్టర్” సినిమా.
నటీనటుల పనితీరు: వైవా హర్ష అలియాస్ హర్ష చెముడు ఒక కథానాయకుడిలా కాకుండా పాత్రధారిగా సుందర్ అనే క్యారెక్టర్ కు ప్రాణం పోసాడు. ఆ క్యారెక్టర్ లోని స్వార్ధం, అమాయకత్వం అతడి ముఖంలో ప్రస్పుటించాయి. అయితే.. సెకండాఫ్ లో సుందర్ క్యారెక్టర్ రియలైజ్ అయ్యే విధానం మరీ ఎక్కువగా నాటకీయంగా ఉండడంతో ఆడియన్స్ ఆ క్యారెక్టర్ కు పెద్దగా కనెక్ట్ అవ్వలేకపోయారు.
దివ్య శ్రీపాదను మైనా అనే పాత్రలో క్యారెక్టరైజేషన్ కోసం మరీ ఎక్కువగా కంట్రోల్ చేయడంతో ఆమె పాత్ర పండలేదు. కంచర్లపాలెం తరహాలో కాస్త సహజమైన నటులను ఊరి ప్రజలుగా సెలక్ట్ చేసుకొని ఉంటే.. వాళ్ళ క్యారెక్టర్స్ & కామెడీ బాగా వర్కవుట్ అయ్యేది.
సాంకేతికవర్గం పనితీరు: శ్రీచరణ్ పాకాల సంగీతం, దీపక్ సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉన్నాయి. కాకపోతే.. ప్రత్యేకించి మెచ్చుకొనే స్థాయి వర్క్ కనిపించలేదు. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ డిపార్ట్మెంట్ తమకు ఇచ్చిన బడ్జెట్ లో మంచి అవుట్ పుట్ ఇచ్చారు. దర్శకుడు ఒక కామెడీ సినిమాలో సమాజం మీద బాధ్యతను చాటుకోవాలనుకున్నాడు. అక్కడే దెబ్బకొట్టింది. సెటైరికల్ గా రంగు, రాగద్వేషాల మీద రాసుకున్న సీన్స్ వర్కవుట్ అయినప్పటికీ.. ప్రభుత్వాలకు ప్రకృతి మీద ఉండే అలసత్వాన్ని చూపించిన విధానం కనెక్ట్ అవ్వలేదు.
అందులోనూ.. సెకండాఫ్ ను మరీ కంగారుగా ముగించేయడం కోసం రాసుకున్న సన్నివేశాలు, ఎండింగ్ లో ఇచ్చిన మెసేజ్ హత్తుకొనే లేదా ఆలోచింపజేసే స్థాయిలో లేవు. ఆ కారణంగా కథకుడిగా, దర్శకుడిగా అలరించడంలో కళ్యాణ్ సంతోష్ విఫలమయ్యాడని చెప్పాలి.
విశ్లేషణ: ఒక సినిమా ద్వారా ప్రేక్షకులను ఆలోచింపజేయాలి అనుకున్నప్పుడు, సన్నివేశాల రూపకల్పనలో నిజాయితీ కనిపించాలి, హాస్యం ఆరోగ్యమైన శైలిలో ఉండాలి. పాత్రల వ్యవహార శైలి రిలేటబుల్ గా ఉండాలి. ఈ మూడు లేనప్పుడు సినిమా ఆడీయన్స్ ను ఆకట్టుకోవడంలో మరియు ఆలోచింపజేయడంలో విఫలమవుతుంది. “సుందరం మాస్టర్” (Sundaram Master) విషయంలో అదే జరిగింది. అయితే.. హర్ష చెముడు సహజమైన నటన, ఫస్టాఫ్ లోని కామెడీ కోసం ఒకసారి చూడొచ్చు!