బాహుబలి సినిమాతో రానా ఇండియన్ స్టార్ అయిపోయారు. ఆ తర్వాత అతను చేసిన ఘాజి కూడా వివిధ భాషల్లో మంచి విజయం సాధించింది. దీంతో అతని సినిమాలు ఏకకాలంలో మూడు భాషల్లో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. అటువంటి వాటిలో హిరణ్య కశ్యప మూవీ ఒకటి. రుద్రమదేవి తర్వాత గుణశేఖర్ చేస్తున్న ఈ సినిమాలో హిరణ్య కశ్యప గా రానా నటించనున్నారు. ఈ ప్రాజక్ట్ ని అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించాలని గుణశేఖర్ ఫిక్స్ అయ్యారు. రానాపై వంద కోట్లు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. అందుకే ఈ సినిమా నిర్మాణంలో రానా తండ్రి సురేష్ బాబు కూడా భాగస్వాములు అయ్యారు. ఈ మూవీ గురించి కొన్ని రోజులుగా అప్డేట్స్ లేదు. తాజాగా మీడియా ముందుకు వచ్చిన సురేష్ బాబు ని “హిరణ్యకశిప” గురించి అడగగా ఇలా స్పందించారు. “గుణశేఖర్ సిద్ధం చేసుకున్న ‘హిరణ్యకశిప’ కథ ని మా బ్యానర్లో నే నిర్మిస్తాము.
రెండేళ్ల నుంచి ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ పనులు ఎప్పటికి పూర్తవుతాయన్నది ఇప్పుడే చెప్పలేను. గుణశేఖర్ .. రానా దగ్గరుండి ఆ పనులను చూసుకుంటున్నారు. మా బ్యానర్ కి ఈ సినిమా వెరీ వెరీ స్పెషల్ అవుతుంది. మా బ్యానర్లో ఇంతటి భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తుండటం ఇదే తొలిసారి” అని ఆయన క్లారిటీ ఇచ్చారు. రుద్రమదేవి సినిమాకి ఆర్ధిక ఇబ్బందుల వల్ల తాను అనుకున్నట్టుగా గుణశేఖర్ తెరకెక్కించలేకపోయారు. ఇప్పుడు సురేష్ బాబు అండతో అద్భుతాన్ని ఆవిష్కరించడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు