Suriya: ‘జైభీమ్’ గురించి మాట్లాడుతూ సూర్య ఏమన్నారంటే..!
March 6, 2022 / 04:41 PM IST
|Follow Us
హీరోయిజం ఛట్రంలో చిక్కుకుపోవడం ఏ హీరోకీ నచ్చదు. అన్ని రకాల పాత్రలు చేయాలని, అన్ని విధాలా ప్రేక్షకుల్ని అలరించాలని ఎప్పుడూ అనుకుంటూనే ఉంటారు. కానీ ఏమవుతుందో ఏమో ఒక జోనర్లో, ఒక తరహా కథలో విజయం అందుకున్నాక… ఇక ప్రయోగాల జోలికి వెళ్లరు. కానీ తమిళంలో కథానాయకులు విజయం దక్కకపోయినా ప్రయోగాలు చేస్తుంటారు. అయితే అక్కడ ప్రేక్షకులు ప్రయోగాలకు విలువిచ్చి సినిమాలను గౌరవిస్తుంటారు. ఈ క్రమంలో హీరోయిజం మీద ప్రశ్న వస్తుంది. తాజాగా దాని గురించి సూర్య మాట్లాడారు.
హీరోయిజం గురించి మాట్లాడుతూ… సూర్య తన రీసెంట్ సినిమాల గురించి మాట్లాడారు. ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాలో పెళ్లాంతో చెంప దెబ్బ తింటుంది సూర్య పాత్ర. అలాగే అవసరం కోసం ఆమెనే డబ్బు అడుగుతుంది. ఇక రీసెంట్ మూవీ ‘జై భీమ్’లో అయితే తొలి అరగంట వరకు సూర్య పాత్ర కనిపించదు. మామూలుగా అయితే ఇలాంటి పాత్రలు మాస్ హీరో, స్టార్ హీరోలు ఒప్పుకోరు. కానీ సూర్య ఈ సినిమాలు చేశారు. ఎందుకు సూర్య… ఇలా అని అడిగితే… హీరోయిజం గురించి ఆలోచిస్తే ఆ తరహా సినిమాలు చేయలేం అని తేల్చేశాడు.
హీరోయిజం గురించి ఆలోచించకుండా చేశాను కాబట్టే ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ లాంటి సినిమాలు నాకు అంత గౌరవాన్ని తెచ్చిపెట్టాయి అని అంటున్నాడు సూర్య. సమాజంలో గుర్తింపుకి నోచుకోని తెగల గురించి, వారి సంక్షేమం గురించి ప్రభుత్వాలు ఆలోచించేలా చేసిన సినిమా ‘జై భీమ్’. సామాజిక మార్పును తీసుకొచ్చిన చిత్రమనిపించి ఆ సినిమా చేశాను అన్నాడు సూర్య. ఇక తను ఇలాంటి పాత్రలు చేయడానికి స్ఫూర్తి నటుడు సత్యరాజ్ అని చెప్పాడు సూర్య.
కొన్నింటిని వదులుకుంటేనే చాలా సంపాదిస్తామనే మాటను సూర్య బలంగా నమ్ముతారట. ఇలా వదులుకున్న వాటిలో అహం మొదలుకొని చాలానే ఉన్నాయట. అసలు ఆ విషయంలో నాకు సత్యరాజ్నే స్ఫూర్తి అన్నారు సూర్య. ఆయన మొదట విలన్గా చేశారు… ఆ తర్వాత హీరో అయ్యారు, కట్టప్ప లాంటి పాత్రలు చేశారు. ఇప్పుడేమో విలన్గా కూడా చేస్తున్నారు. ఎందుకు మామ అంటే… నేటితరం ప్రేక్షకులు నన్ను విలన్గా చూడలేదు కదా అంటున్నారు అని చెప్పుకొచ్చాడు సూర్య. ఇలాంటి పాత్రలు చేసే ధైర్యం మన హీరోలకు, ఆ సినిమాలను ఆదరించే మనసు మన ప్రేక్షకులకూ కావాలి.