తంబీలు క్యూ కట్టేస్తున్నారే…

  • November 3, 2016 / 08:33 AM IST

కొన్నాళ్ల క్రితం రజనీకాంత్, కమల్ హాసన్ సినిమాలే అనువాద రూపంలో తెలుగు తెరమీదికి వచ్చేవి. తర్వాత విక్రమ్, సూర్య సినిమాలు ఆ కోవలో చేరాయి. ఓ దశలో ప్రశాంత్, అజిత్ సినిమాలు రాగా కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చి అజిత్ మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చేశారు. సూర్య పుణ్యమా అని తమ్ముడు కార్తీ కూడా అన్న పక్కనే పోస్టర్ అంటించేశాడు. ఇక తెలుగు వాళ్ళైన విశాల్,. ఆది పినిశెట్టి, జయం రవి ఇదే బాటలో కొనసాగుతున్నారు. ‘రంగం’తో జీవ, ‘రఘువరన్ బీటెక్’ ఫలితం చూసి ధనుష్, ‘తుపాకీ’ పుణ్యమా అని విజయ్ తమ సినిమాలన్నీ తెలుగులో విడుదలయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా మరో ఇద్దరు హీరోలు కూడా ఈ జాబితాలో చేరారు.

‘నానుమ్ రౌడీదాన్’ సినిమా తెలుగులో ‘నేనూ రౌడీనే’ పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే. తమిళ హీరో విజయ్ సేతుపతి నయనతార అండతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ సినిమాతోనే. ఇప్పుడు అతడు నటించిన ధర్మదురై సినిమా కూడా ‘Dr. ధర్మరాజు ఎంబిబిఎస్’ పేరుతో తెలుగులో అనువాదమవుతోంది. తొలిసినిమాకి నయన్ సాయం తీసుకున్న ఈ యువ హీరో రెండో సినిమాకి తమన్నాని వెంట పెట్టుకొస్తున్నాడు. ఇక తర్వాతి సూపర్ స్టార్ గా తమిళనాట మార్మోగిపోతున్న పేరు శివకార్తికేయన్ ‘రెమో’ సినిమాతో త్వరలో థియేటర్లలోకి రానున్నాడు. పైగా ఇతగాడికి దిల్ రాజ్ వంటి అగ్ర నిర్మాత భుజం కాస్తున్నాడు.

ఇలా తంబీలంతా తెలుగు రాష్ట్రాలకు క్యూ కట్టి మరీ వచ్చేస్తుంటే.. మహేశ్, నాగ్, అల్లు అర్జున్ ఇప్పుడిప్పుడే అక్కడ అడుగు పెట్టే పనుల్లో పడ్డారు. నాని, శర్వానంద్, సందీప్ కిషన్, అల్లరి నరేష్ వంటి వారు ఒకటి అరా తమిళ సినిమాలు చేసిన అక్కడి వాళ్ళు ఇక్కడ చూపిస్తున్న ప్రభావం చూపించలేకపోతున్నారు. మున్ముందు మెరుగుపడతారేమో చూడాలి.

https://www.youtube.com/watch?v=LYI_yA5qpuI

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus