తాజా ఘటనలపై ఆవేదన వ్యక్తం చేసిన తమ్మారెడ్డి!

  • June 18, 2018 / 03:57 PM IST

మొన్న డ్రగ్స్.. నిన్న కాస్టింగ్ కౌచ్.. నేడు వ్యభిచారం.. ఇలా వరుసగా వివాదాలు తెలుగు చిత్ర పరిశ్రమ పరువును తీస్తున్నాయి. ఏ మూల ఏ తప్పు జరిగినా అందులో సినిమా వాళ్ళే కీలకం అంటూకొన్ని మీడియా కంపెనీలు అత్యుత్సాహం ప్రదర్శించడం సినిమా ప్రముఖులను తెగ బాధ పెడుతోంది. తాజాగా అమెరికాలో సెక్స్ రాకెట్ బయటపెడితే అందులో టాలీవుడ్ నటీమణులు ఉన్నారని చానళ్ళు ఊదరగొడుతున్నాయి. పైగా ఆ సెక్స్ రాకెట్ ని టాలీవుడ్ కి చెందిన వారే నడిపిస్తున్నారనడం.. ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.  ఈ వ్యవహారంపై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. “ఈ మధ్య కాలంలో అమెరికాలో వ్యభిచారం చేయిస్తున్నారని  కిషన్, చంద్ర కల అనే దంపతులను అరెస్టు చేశారు. చార్జిషీట్ లో కూడా పింప్ (తార్చేవాడు) అనే రాశారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లమని వాళ్లు (కిషన్, చంద్ర) చెప్పారట. ఇంతకాలం భారతదేశంలోనే అనుకున్నా.. ఇప్పుడు, ప్రపంచంలో ఏది జరిగినా కూడా దానికి తెలుగు సినిమావాళ్లే కారణమైపోతున్నారు.

కొంచెం బాధగా ఉంది. వాళ్లెవరో తెలియదు. ఎప్పుడో సినిమా ఇండస్ట్రీలో ఉన్నారంటారు. అతన్ని (కిషన్) పింప్ అని అనకుండా ప్రొడ్యూసర్, సినిమావాడని మీడియా వాళ్లు ఎందుకంటున్నారు? తప్పు పని చేసినవాడిని తప్పుడోడు అని అనకుండా, సినిమా ఇండస్ట్రీపై బురద జల్లడం ఎంతవరకు న్యాయం?” అని ప్రశ్నించారు. ఇంకా మాట్లాడుతూ “సినిమా వారి గురించి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతుంటే ఇండస్ట్రీ ఎందుకు ఊరుకుంటోంది? సైలెంట్ గా ఉంటే మరింత ఎక్కువవుతుంది.  దీనిని ఆపాలంటే మీడియా మిత్రులు సహకరించాలి. మీడియా మిత్రులను అడిగేదేమిటంటే.. మంచి రాయండి, చెడూ రాయండి. కానీ, లేనివి ఉన్నట్లుగా రాయడం.. ఎవరో బురదజల్లుతుంటే.. సాక్ష్యాలు లేకుండా వాటిని ప్రసారం చేయొద్దు. ఇదే పరిస్థితి కొనసాగితే తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలు ఉండకుండా పోయే అవకాశాలు వస్తాయి” అని తమ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మరి వీటికి పరిష్కారం ఎలా దొరుకుతుందో.. సినిమా పెద్దలే ఆలోచించాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus