Balagam: ‘బలగం’ టీమ్‌ని వరించిన తెలుగు సినిమా వేదిక నంది పురస్కారాలు..!
March 24, 2023 / 10:52 AM IST
|Follow Us
కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకులను అలరించిన ‘టిల్లు’ వేణు అలియాస్ వేణు యెల్దండి దర్శకుడిగా మారి ‘బలగం’ అనే ఫీల్ గుడ్, ఎమోషనల్ ఎంటర్టైనర్ని తెరకెక్కించి, ప్రేక్షకులతో పాటు పరిశ్రమ వర్గాల వారిని ఆశ్చర్యపరిచాడు.. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో.. తెలంగాణ నేపథ్యం, పల్లెటూరి వాతవరణంలో సహజమైన పాత్రలతో.. మానవ సంబంధాలను మనసుల్ని కదిలించేలా చూపించి కంటతడి పెట్టించాడు.. ‘‘ఇది చిన్న సినిమా కాదు.. ప్రేక్షకులు మనసులు గెలిచిన సినిమా’’ అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు..
వేణు లాంటి హాస్యనటుడు ఇలాంటి సున్నితమైన భావోద్వేగాలు కలిగిన కథను ఇంతలా హ్యాండిల్ చేస్తాడని ఎవరూ ఊహించలేదసలు.. మెగాస్టార్ చిరంజీవితో సహా పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని, దర్శకుడిని, చిత్ర బృందాన్ని ప్రశంసించారు.. ఉగాది పర్వదినాన ‘తెలుగు సినిమా వేదిక ఉగాది నంది పురస్కారాలు’ ఈ చిత్రాన్ని వరించడం విశేషం.. ‘బలగం’ నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షిత, దర్శకుడు వేణు, హీరో ప్రియదర్శి, హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ మరియు ఇతర నటీ నటులు సాంకేతిక నిపుణులను ఎఫ్డిసి చైర్మన్ అనిల్ కూర్మాచలం, ఆర్. నారాయణ మూర్తి, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ రుద్రరాజు పద్మరాజు నంది పురస్కారాలతో ఘనంగా సత్కరించారు..
ఉగాది రోజు టీం మొత్తాన్ని ఘనంగా సత్కరించిన తెలుగు సినిమా వేదిక అధ్యక్షులు విజయ్ వర్మ పాకలపాటికి నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షిత, నటీనటులు, సాంకేతిక నిపుణులు కృతజ్ఞతలు తెలియజేశారు.. ‘బలగం’ లాంటి చిత్రాలు మరిన్ని రావాలని, ఇదొక దృశ్యకావ్యం అని ఆర్. నారాయణ మూర్తి, రుద్రరాజు పద్మ రాజు కొనియాడారు.. మంచి సాంప్రదాయానికి తెరదీసిన తెలుగు సినిమా వేదిక అధ్యక్షులు వర్మ పాకలపాటి, ఉపాధ్యక్షులు మిమిక్రీ రమేష్‌కి అభినందనలు తెలిపి..
త్వరలో ‘సింహ’ పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున పురస్కారాలు ఇచ్చే యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ అనిల్ కూర్మాచలం ప్రకటించారు.. ఈ సందర్భంగా చిత్ర రంగానికి చెందిన వారు ‘బలగం’ టీంకి అభినందనలు తెలియజేస్తున్నారు..