సూపర్ గుడ్ ఫిల్మ్స్ అంటే ఓ సూపర్ ఫీలింగ్ ఉంటుంది. సగటు సినిమాల్లానే ఉన్నా.. ఏదో తెలియని కొత్తరకం ఫీలింగ్ కలుగుతుంది వారి సినిమాల్లో. అలా కొన్నేళ్లపాటు తెలుగు, తమిళ పరిశ్రమల్లో వరుస సినిమాలు చేశారు. పేర్లు కాస్త అటు ఇటూ మారినా.. ఆ బ్యానర్ నుండి వచ్చే సినిమాలు అదుర్స్ అంతే. ఈ ప్రొడక్షన్ హౌస్ కీలకమైన మైలు రాయికి చేరుకుంది. త్వరలో ఈ నిర్మాణ సంస్థ వందో సినిమాకు చేరనుంది. ఇప్పుడు దీని గురించే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
ముందుగా చెప్పినట్లు ఫీల్ గుడ్ ఫిల్మ్స్ తీసే సూపర్ గుడ్ ఫిల్మ్స్ 80, 90ల్లో ఓ రేంజిలో విజయాలు అందుకుంది. తెలుగులో ‘సుస్వాగతం’, ‘రాజా’, ‘సూర్యవంశం’, ‘నువ్వు వస్తావని’, ‘నిన్నే ప్రేమిస్తా’, ‘సింహరాశి’, ‘సంక్రాంతి’, ‘నవ వసంతం’, ‘గోరింటాకు’ ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘రచ్చ’, ‘ఇష్క్’ అంటూ వరుస విజయాలు అందుకున్నారు. 2000 తర్వాత ఎదురైన కొన్ని పరాజయాల కారణంగా ఈ సంస్థ జోరు తగ్గింది.
గత దశాబ్ద కాలంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ పేరు పెద్దగా వినిపించలేదు. ఇటీవల ఆ సంస్థ మళ్లీ యాక్టివ్ అవుతోంది. చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సంస్థలో 97వ సినిమా. దీంతో సూపర్ గుడ్ ఫిలింస్ వందో సినిమా ఏమవుతుంది అనే చర్చ మొదలైంది. దీనికి నిర్మాత ఆర్బీ చౌదరి తనయుడు, కథానాయకుడు జీవా క్లారిటీ ఇచ్చారు. తమ బ్యానర్లో వందో సినిమా థళపతి విజయ్‌తో ఉంటుందని చెప్పుకొచ్చారు. తమ సంస్థ వందో సినిమాలో నటించడానికి విజయ్ అంగీకరించినట్లు జీవా తెలిపాడు.
అంతేకాదు ఈ సినిమాలో తాను కూడా నటిస్తానని జీవా తెలిపాడు. అలాగే ఈ సినిమా కోసం పారితోషికం కూడా తీసుకోనని వెల్లడించాడు. ఈ సినిమాలో నటించే అవకాశం ఇవ్వమని తానే తన తండ్రిని అడిగినట్టు జీవా చెప్పడం గమనార్హం. అయితే ఈ సినిమాకు సంబంధించి కథ, దర్శకుడు తదితర విషయాలు ఇంకా ఏవీ క్లియర్‌గా బయటకు రాలేదు. విజయ్‌కి గతంలో ఈ బ్యానర్లో మంచి ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. వాటితోనే విజయ్ నిలబడ్డాడు అని చెప్పొచ్చు. ఆ కృతజ్ఞతతోనే వందో సినిమాకు ఓకే చెప్పాడు అని అంటున్నారు.