Chiranjeevi, Jagan meeting: ట్యాక్స్ కట్టకపోవడం వల్లే ఈ సమస్య: తమ్మారెడ్డి
February 10, 2022 / 03:31 PM IST
|Follow Us
సినిమా పరిశ్రమలకు చాలా సమస్యలు. అందులో ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్ల సమస్య చిన్నది అని ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. సినిమా ఇండస్ట్రీ గురించి, అందులోని సమస్యల గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో తమ్మారెడ్డి ఇటీవల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పరిశ్రమ పెద్దలకు కొన్ని సూచనలు చేశారు. సమస్యల్ని ప్రస్తావించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సమస్యలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కి ఇప్పటికే తెలియజేశాం.
ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని తీసుకురావాలని కోరాం. ఆ పద్ధతి ద్వారానే నిర్మాతలకు లాభాలు వస్తాయి అనేది నా ఆలోచన అని చెప్పారు తమ్మారెడ్డి. తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు పెంచడం వల్ల ‘అర్జున ఫల్గుణ’ లాంటి చిన్న సినిమాకి నష్టం వచ్చింది. ‘బంగార్రాజు’ ఏపీలో ఎక్కువ వసూళ్లు రాబట్టింది. తెలంగాణలో పెద్దగా వసూలు చేయలేకపోయింది అని గుర్తు చేశారు.
* ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో సినిమాల టికెట్ ధరలు తగ్గించటం వల్ల సినిమా రెవెన్యూకి పెద్దగా లోటు ఉండదు. సినిమా నిర్మాణానికి సంబంధించి చిత్ర పరిశ్రమలోనూ కొన్ని తప్పులు జరిగాయన్నారు తమ్మారెడ్డి.
* ప్రొడక్షన్స్ కాస్ట్ కంట్రోల్ విషయంలో ఆలోచించాలి. అంటే నటులు రెమ్యూనరేషన్ తగ్గించుకోమని చెప్పడం లేదు. చిత్రీకరణలో విలాసానికి అయ్యే ఖర్చు తగ్గించుకోవాలి.
* చిరంజీవి ఇటీవల ఏపీ సీఎం జగన్‌ను కలిశారు. మరోసారి ఆయనతో చర్చించబోతున్నారు. అందరితో కలిసి వెళ్లినా ఆయన ఒక్కరే వెళ్లినా అది సినిమా పరిశ్రమ కోసమే.
* గతంలో సినిమా టికెట్ ధరల్ని ఇష్టమొచ్చినట్టు పెంచి… ఆ వసూళ్లకు సంబంధించిన పన్ను ప్రభుత్వానిఇక కట్టలేదు. అందుకే ప్రభుత్వం దీనిపై దృష్టిపెట్టింది అని తమ్మారెడ్డి అన్నారు.
* చాలామంది ‘మా సినిమా ₹ 300 కోట్లు,₹400 కోట్లు వసూలు చేసింది అని చెబుతున్నారు. అలా వచ్చిన లాభంలో ప్రభుత్వానికి ట్యాక్స్ కడితే వాతావరణం ఆరోగ్యకరంగా ఉంటుంది.
* పెద్ద సినిమాలతోపాటు చిన్న సినిమాలకు 5వ షో అవకాశమిస్తే బాగుంటుంది. దాని వల్ల చిన్న సినిమా బాగుపడుతుంది. చిన్న సినిమాలకు సబ్సిడీ ఇవ్వాలి. మినీ థియేటర్లను ప్రోత్సహించాలి.
* గతంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కమిటీలను ఏర్పాటు చేసి నంది అవార్డులు ఇస్తామని చెప్పాయి. కానీ ఇప్పటి వరకూ అవార్డులు ప్రకటించలేదు.