Actress: ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!
October 24, 2023 / 11:34 AM IST
|Follow Us
సినిమా తర్వాత సినిమా… ఒకేసారి రెండు లేక మూడు సినిమాలు చేసే హీరోయిన్లు హఠాత్తుగా కొత్త సినిమా సైన్ చేయకపోతే? ‘వాట్ నెక్ట్స్’ అనే ప్రశ్న ఎదురవుతుంది. ఆ నాయికలు ఇతర భాషల్లో సినిమాలు చేస్తున్నప్పటికీ డైరీలో తెలుగు సినిమా లేకపోవడం ఫ్యాన్స్‌ని నిరుత్సాహపరిచే విషయం. ప్రస్తుతం తెలుగులో సినిమా సైన్ చేయని నాయికల గురించి తెలుసుకుందాం.
ఈ ఏడాది నవీన్ పొలిశెట్టి, అనుష్క జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సెప్టెంబర్ 7న విడుదలై, హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇక నాన్‌స్టాప్‌గా సినిమాలు చేస్తానని, తెలుగులో గ్యాప్ లేకుండా ప్రాజెక్ట్స్ కమిట్ అవుతానని అన్నారు అనుష్క. ప్రస్తుతం ‘కథనార్– ది వైల్డ్ సోర్సెరర్’ చిత్రంతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. అయితే తెలుగులో కొత్త సినిమా ఏదీ సైన్ చేయలేదు.
మయోసైటిస్ పూర్తి స్థాయి చికిత్స కోసమే సమంత సంవత్సరం పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ చిత్రం సెప్టెంబరు 1న విడుదలై, మంచి హిట్‌గా నిలిచింది. ‘ఖుషి’ వంటి హిట్ మూవీ తర్వాత సమంత నటించనున్న తెలుగు సినిమా ఏంటి? అన్నదానిపై ఎలాంటి స్పష్టత లేదు.
సౌత్‌లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు రకుల్ ప్రీత్‌సింగ్. తెలుగులో వరుస చిత్రాలతో తన సత్తా చాటిన ఈ బ్యూటీ రెండేళ్లుగా ఒక్క తెలుగు సినిమా కూడా చేయకపోవడం విశేషం. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో ‘ఐ లవ్ యు’, ‘మేరీ పత్నీ కా రీమేక్’ చిత్రాలతో పాటు తమిళంలో ‘ఆయ లాన్, ఇండియన్ 2’ చిత్రాలు చేస్తున్నారు.
ఈ ఏడాది కృతిశెట్టి నటించిన తెలుగు చిత్రం ‘కస్టడీ’ ఒక్కటే రిలీజ్ అయింది. ఆ చిత్రం విడుదలై ఆర్నెల్లు దాటినా మరో తెలుగు సినిమా సైన్ చేయలేదు కృతి.
ఈ ఏడాది ‘దసరా, భోళా శంకర్’ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు కీర్తీ సురేశ్. ఆ చిత్రాల తర్వాత మరో తెలుగు సినిమా అంగీకరించలేదు.
అదే విధంగా గత ఏడాది విడుదలైన ‘ఆచార్య’ సినిమా తర్వాత మరో తెలుగు సినిమా ఒప్పుకోలేదు పూజా హెగ్డే. మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’లో హీరోయిన్గా ఎంపికైనా ఎందుకనో ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారీ బ్యూటీ.
అలాగే ‘నన్ను దోచుకుందువటే’ (2018) సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన నభా నటేశ్ ఆ తర్వాత వరుసగా తెలుగు చిత్రాలు చేశారు. అయితే ‘మాస్ట్రో’ (2021) తర్వాత ఇప్పటివరకూ ఆమె మరో తెలుగు సినిమాపై ఎలాంటి సమాచారం లేదు.
అదే విధంగా మెహరీన్, నిధీ అగర్వాల్, అనూ ఇమ్మాన్యుయేల్ వంటి హీరోయిన్ల జోరు కూడా తెలుగులో తగ్గింది. మెహరీన్ ఈ ఏడాది ‘స్పార్క్’ (తెలుగు–తమిళ్) లో నటిస్తున్నారు. ఆ తర్వాత ఆమె నటించే తెలుగు సినిమాపై క్లారిటీ లేదు.
అలాగే ఈ ఏడాది ఏప్రిల్‌లో రిలీజైన ‘రావణాసుర’ చిత్రం తర్వాత అనూ ఇమ్మాన్యుయేల్ ఏ తెలుగు సినిమాలోనూ నటించడం లేదు.
అలాగే నిధీ అగర్వాల్ చేతిలోనూ ‘హరిహర వీరమల్లు’ మినహా మరో తెలుగు సినిమా లేదు. ఈ సినిమా ఎప్పుడో ఒప్పుకున్నారామె. అయితే షూటింగ్ ఆలస్యం అవుతోంది. ఈ చిత్రం తర్వాత వేరే ఏ తెలుగు సినిమా కూడా ఆమె కమిట్ కాలేదు.