The Goat Life Review in Telugu: ది గోట్ లైఫ్: ఆడు జీవితం సినిమా రివ్యూ & రేటింగ్!

  • March 28, 2024 / 04:44 PM IST

Cast & Crew

  • పృథ్వీరాజ్ సుకుమారన్ (Hero)
  • అమలా పాల్ (Heroine)
  • జిమ్మీ జీన్-లూయిస్ , శోభా మోహన్, కేఆర్ గోకుల్ , తాలిబ్ అల్ బలూషి, రిక్ అబీ, నాజర్ కరుతేని (Cast)
  • బ్లెస్సీ (Director)
  • బ్లెస్సీ,జిమ్మీ జీన్-లూయిస్,స్టీవెన్ ఆడమ్స్ (Producer)
  • ఎ. ఆర్. రెహమాన్ (Music)
  • సునీల్ కె.ఎస్, కె.యూ. మోహనన్ (Cinematography)

ఈమధ్యకాలంలో పాన్ ఇండియన్ సినిమాలుగా మొదలైన ప్రాజెక్టులే రెండు లేదా మూడేళ్ళలో పూర్తి చేస్తుండగా.. ఒక సినిమా దాదాపుగా 16 ఏళ్లపాటు మేకింగ్ లో ఉందని చెప్తే నమ్మడం కూడా కష్టమే. కానీ.. మలయాళ మేకర్స్ దాన్ని సుసాధ్యం చేశారు. కేరళలో సాహిత్య అకాడమీ అవార్డ్ సొంతం చేసుకున్న “ఆడు జీవితం” అనే 2008లో ప్రచురితమైన పుస్తకం ఆధారంగా తెరకెక్కిన చిత్రం “ది గోట్ లైఫ్: ఆడు జీవితం”. పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బ్లెస్సీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు (మార్చి 28) ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది. మలయాళంతోపాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!

కథ: కేరళలోని ఓ గ్రామానికి చెందిన సగటు వ్యక్తి నజీబ్ (పృథ్విరాజ్ సుకుమారన్), మంచి జీతం కోసం ఆశపడి స్నేహితుడితో కలిసి దుబాయ్ చేరుకుంటాడు. కొత్త జీవితం మొదలెడదామని ఎన్నో ఆశలతో దుబాయ్ లో అడుగుపెట్టిన నజీబ్ తెలియకుండా ఎడారిలో గొర్రెలు కాసే పనిలో ఇరుక్కుంటాడు. అక్కడనుండి ఎలా బయటపడాలో తెలియక, ఎలా బ్రతకాలో అర్ధం కాక నానా ఇబ్బందులు పడుతుంటాడు.

ఆ దుబాయ్ ఎడారుల నుండి నజీబ్ బయటపడగలిగాడా లేదా? ఈ ప్రయాణంలో అతడు ఎదుర్కొన్న కష్టాలేమిటి? వంటి ప్రశ్నలకు సమాధానమే “ది గోట్ లైఫ్: ఆడు జీవితం”.

నటీనటుల పనితీరు: నటనకుగాను కేరళలో ఎన్ని అవార్డులున్నాయో అన్నీ పృథ్విరాజ్ ఇంటికి చేరుకోవడం ఖాయం. ఒక నటుడిగా కంటే ఒక వ్యక్తిగా అతడు పడిన కష్టానికి కరతాళధ్వనులతో కితాబివ్వడం తప్ప ఏం చేయగలం. ఒక మనిషిని ఆశ బ్రతికిస్తుంది, నిరాశ చంపేస్తుంది. ఈ ఆశకి, నిరాశకి మధ్యలో కొట్టుమిట్టాడే జీవితాలు చాలానే ఉంటాయి. అటువంటి ఒక పాత్ర నజీబ్. ఈ రెండిటికీ మధ్య ఆంతర్యాన్ని చాలా అద్భుతంగా పండించాడు పృథ్వి. ముఖ్యంగా.. ఎడారిలో ఎండుతూ.. కేరళలోని తన జీవితాన్ని తలుచుకుంటూ అతడు సాగించే ప్రయాణం కంటతడి పెట్టిస్తుంది. అమలాపాల్ పాత్ర చిన్నదే అయినప్పటికీ.. ఆమె క్రియేట్ చేసే ఇంపాక్ట్ బాగుంటుంది.

ఆమె తెరపై కనిపించిన ప్రతిసారి సినిమాకి తెలియని జీవం వస్తుంది. అది కథనంలోనూ ప్రస్ఫుటిస్తుంది. జిమ్మీ, కె.ఆర్.గోకుల్ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: ఏ.ఆర్.రెహమాన్ ఇప్పటివరకు చాలా అత్యద్భుతమైన నేపధ్య సంగీతాన్ని ఇచ్చి ఉండొచ్చు. కానీ.. ది గోట్ లైఫ్ కి ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోరులో జీవం ఉంది. నజీబ్ ప్రయాణంలోని వ్యధ, స్వేచ్ఛ కోసం పడే తపన, ఒక చుక్క నీరు కోసం చేసే పోరాటం అన్నీ రెహమాన్ వాయిద్యాల ద్వారా కంటిపొరల నుండి హృదయానికి గుచ్చుకుంటాయి. ఈ సినిమా ఒరిజినల్ సౌండ్ ట్రాక్ త్వరగా విడుదల చేస్తే బాగుంటుంది.

ఒక ప్రేక్షకుడు సినిమాను ఆస్వాదిస్తున్నాడంటే అది కచ్చితంగా సినిమాటోగ్రాఫర్ పనితనం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే.. ఈ సినిమాలో సునీల్ పనితనం ఏస్థాయిలో ఉందంటే.. ప్రేక్షకుడు కూడా ఎడారిలో కూర్చున్న భావన కలుగుతుంది. ముఖ్యంగా పృథ్విరాజ్ కి పెట్టిన టైట్ క్లోజ్ షాట్స్ & లాంగ్ షాట్స్ లో ఎడారి లో ఒంటరి ప్రయాణాన్ని చూపించిన విధానం అద్భుతమనే చెప్పాలి.

వీళ్లిద్దరి తర్వాత మాట్లాడుకోవాల్సింది ప్రొడక్షన్ డిజైనర్స్ గురుంచి. 2018లో మొదలైన ఈ సినిమా ప్రొడక్షన్ దాదాపుగా 2023 వరకు సాగింది. కరోనా కారణంగా డిలే అవ్వడం వంటివి జరిగినా.. క్యారెక్టర్ లో కనిపించే చిన్నపాటి కంటిన్యుటీ మిస్టేక్స్ తప్ప.. పెద్దగా తప్పుబట్టేంతలా ఏమీ లేకపోవడం అనేది వారి సిన్సియారిటీకి ప్రతీక.

దర్శకుడు బ్లెస్సీ ఒక ఫిలిం మేకర్ గా భీభత్సమైన ఫార్మ్ లో ఉన్న తరుణంలో 2008లో విడుదలైన “ఆడు జీవితం” పుస్తకం విపరీతంగా నచ్చి, ఆ పుస్తకాన్ని సినిమాగా తెరకెక్కించడం కోసం తన 16 ఏళ్ల సమయాన్ని వెచ్చించడం అనేది మామూలు విషయం కాదు. ఒక దర్శకుడిగా, రచయితగా అతడి పనితనాన్ని చూసి మెచ్చుకోవడమే అతడికి మనం ఇచ్చే మర్యాద.

విశ్లేషణ: “ది గోట్ లైఫ్: ఆడు జీవితం” అనేది ఆర్ట్ సినిమా ఫార్మాట్ లో తెరకెక్కిన కమర్షియల్ చిత్రం. ఒక వ్యక్తి జీవితం కనిపిస్తుంది, కష్టం కనిపిస్తుంది. వీటన్నిటికంటే ముఖ్యంగా ఆశావాదిగా జీవించడం అనేది ఎంత అవసరమో తెలియచెబుతుంది. మల్టీప్లెక్స్ & క్లాస్ సినిమా మెచ్చే ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకునే చిత్రమిది.

ఫోకస్ పాయింట్: ఆశ్చర్యపరుస్తూ.. ఆలోజింపజేసే ఆశావాహ జీవితం

రేటింగ్: 3/5

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus