Rahul Sipligunj: ఆస్కార్స్ వేదికనెక్కిన సింగర్ రాహుల్ సిపిగ్లంజ్ గురించి ఆసక్తికర విషయాలు..!
March 15, 2023 / 11:25 AM IST
|Follow Us
రాహుల్ సిప్లిగంజ్.. హైదరాబాద్ లో దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగాడు.. ఇప్పుడు తెలుగు వారంతో తనను ప్రశంసించే స్థాయికి చేరుకున్నాడు.. పాటే ప్యాషన్ అనుకునే తన గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది.. టాలెంట్ ఎవరి సొత్తూ కాదు అలాగని ఎలాంటి ఫిల్మీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవడం.. ఒకవేళ అయినా సక్సెస్ అవడం అనేది చాలా అంటే చాలా చాలా కష్టం.. దానికెంతో డెడికేషన్, హార్డ్ వర్క్, కరేజ్ కావాలి.. గల్లీ నుండి ఢిల్లీ వరకు అన్నట్టు ఓల్డ్ సిటీ నుండి వరల్డ్ బిగ్గెస్ట్ ఆస్కార్స్ స్టేజ్ ఎక్కే వరకు జరిగిన రాహుల్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ జర్నీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం..
పాతబస్తీ నుండి ప్రారంభమైన ప్రస్థానం..
1989 ఆగస్టు 22న హైదరాబాద్ పాతబస్తీలోని ధూల్ పేట్లో పుట్టిన రాహుల్‌కి చిన్నప్పటి నుండే సింగింగ్ , మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉండేదట.. స్కూల్ నుండి రాగానే కర్రలతో గిన్నెలపై వాయిస్తూ ఫోక్ సాంగ్స్ పాడేవాడట.. కొడుకు ఆసక్తిని గమనించిన తండ్రి తనకి తెలిసిన గజల్ సింగర్ విఠల్ రావు దగ్గర సంగీతంలో శిక్షణ ఇప్పించారు.. ట్రైనింగ్ తీసుకుంటూనే తండ్రికి బార్బర్ షాపులో సాయం చేస్తుండే వాడు రాహుల్.. దాదాపు 7 సంవత్సరాలు శిక్షణ తీసుకుని గజల్స్ మీద పట్టు సాధించాడు.. అప్పుడే కోరస్ పాడడానికి అవకాశాలొచ్చాయి..
తొలి పాట..
నాగ చైతన్య ఫస్ట్ మూవీ ‘జోష్’ లో ‘కాలేజీ బుల్లోడా’ అనే పాటతో రాహుల్ సోలో సింగర్‌గా ఇంట్రడ్యూస్ అయ్యాడు.. తను పాడిన పాటలన్నిటినీ ఓ సీడీలో కాపీ చేసుకుని ఎమ్.ఎమ్. కీరవాణికి వినిపించాడట.. దాంతో ఆయన జూనియర్ ఎన్టీఆర్ ‘దమ్ము’ లో ‘వాస్తు బాగుందే’ పాట పాడే అవకాశమిచ్చారు.. తర్వాత ‘రచ్చ’ లో ‘సింగరేణుంది’, ‘ఈగ’ లో ‘ఈగ ఈగ’, ‘రంగస్థలం’ లో ‘రంగా రంగా’, ‘ఇస్మార్ట్ శంకర్’ లో బోనాల సాంగ్.. ఇలా పలు పాటలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు..
ప్రైవేట్ ఆల్బమ్స్‌తో ధూం ధాం..
ఓ వైపు సింగర్‌గా కంటిన్యూ అవుతూనే సొంతగా ప్రైవేట్ ఆల్బమ్స్ చేశాడు.. ‘మంగమ్మ’, పూర్ బాయ్’, ‘మాకీ కిరికిరి’, ‘గల్లీకా గణేష్’, ‘దావత్’.. ఇలా తెలంగాణ, హైదరాబాద్ ట్రెడిషన్‌కి తన స్టైల్ జోష్ యాడ్ చేసిన సాంగ్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి.. ‘బిగ్ బాస్ సీజన్ -3’ లో పార్టిసిపెట్ చేసిన తర్వాత తన కెరీర్ మరో మలుపు తిరిగింది.. టైటిల్‌తో ప్రేక్షకుల మనసులు కూడా గెల్చుకున్నాడు.. ‘ఆర్ఆర్ఆర్’ లోని ‘నాటు నాటు’ పాటను అద్భుతంగా పాడి ప్రశంసలందుకున్న రాహుల్.. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ఆస్కార్స్ వేదిక మీద కాల భైరవతో కలిసి లైవ్ పర్ఫార్మ్ చేయడం.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.. ఎక్కడో పాతబస్తీలో పుట్టిన రాహుల్ ప్రపంచవేదికనెక్కడం అభినందనీయం..