The Kashmir Files: మోస్ట్ వాంటెడ్ సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్!
April 21, 2022 / 01:15 PM IST
|Follow Us
‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీయఫ్ 2’ వచ్చాక… భారతీయ చిత్రపరిశ్రమ వీటి గురించే మాట్లాడుకుంటోంది కానీ… అంతకుముందు అందరూ మాట్లాడింది ‘కశ్మీర్ ఫైల్స్’ గురించే. ఈ సినిమా కథ, కథనాలు, వసూళ్లు, వివాదాలు, గొడవలు… వీటి గురించే అందరూ చర్చించుకున్నారు. దీంతో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. మార్చి 11న విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లే సాధించింది. ఇప్పుడు ఓటీటీల్లో సత్తా చాటడానికి సిద్ధమవుతోంది.
అవును, ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్, ప్లాట్ఫామ్ ఫిక్స్ అయ్యాయి. త్వరలోనే ఈ సినిమా జీ5 వేదికగా స్ట్రీమ్ అవుతుందని సమాచారం. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందట. ఈ సినిమా డిజిటల్ రిలీజ్ డేట్ పై జీ5 త్వరలో అధికారిక ప్రకటన ఇవ్వనుందట. అన్నీ అనుకున్నట్లు జరిగితే మే మొదటివారంలో ఈ సినిమా జీ5లో విడుదలవుతుందట. 90వ దశకంలో కశ్మీర్ పండిట్లపై జరిగిన సామూహిక హత్యాకాండ నేపథ్యంలో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాను రూపొందించారు.
ఇందులో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ కీలకపాత్రలు పోషించారు. కశ్మీర్ లోయలోని హిందూ కుటుంబాలపై పాకిస్థాన్ ప్రేరేపిత ముస్లిం ఉగ్రవాదులు దారుణ మారణకాండకు పాల్పడతారు. కశ్మీరీ మహిళలను వివస్త్రలుగా చేసి సామూహిక మానభంగం చేస్తారు. ఆ లోయలో ఉండాలంటే ముస్లింలుగా మతం మార్చుకోవాలని, లేదంటే చంపేస్తామని బెదిరిస్తారు. ఈ క్రమంలో తమకు ఎదురు తిరిగినవారిని చంపడానికి కూడా వెనుకాడరు. వారి ఆస్తులను సైతం దోచుకుంటారు. అప్పట్లో జరిగిన ఈ మారణకాండకు కేంద్రంలో ఉన్న ఓ మంత్రి సాయం చేసినట్లు విమర్శలు ఉన్నాయి.
ఈ మొత్తం వ్యవహారాన్ని ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాలో చూపించారు. అప్పటి దురాగతాల్ని కళ్లకు కట్టినట్లు చూపించారని ఓ వర్గం వారు అంటుంటే.. ఓ వర్గానికి కొమ్ముకాసేలా సినిమా ఉందంటూ మరో వర్గం విమర్శిస్తోంది. ఈ క్రమంలో సినిమాకు మంచి ప్రచారం దక్కి… భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఓటీటీలో ఏం జరుగుతుందో చూడాలి.