వివిధ రంగాల్లో విజేతలుగా నిలిచిన వాళ్ళు బిగ్ బాస్ రియాలిటీ షోలో పార్టిసిపెంట్స్ గా ఉంటారు. అటువంటి వారిని కంట్రోల్ చేయాలంటే…. సున్నితంగా మర్యాదగా ఉంటే సరిపోదు. మిలిటరీ అధికారిలా గంభీరమైన వాయిస్ ఉండాలి. ఉండాలి కాదు ఉంది.. బేస్ వాయిస్ తో హిందీ బిగ్ బాస్ గా అతుల్ కపూర్ గొంతు బాగా పాపులర్ అయింది. మరి తెలుగులో కూడా అటువంటి గొంతే ఉండాలి. నిర్వాహకులు వందలమంది ఆడిషన్స్ చేసి ఒకతన్ని పట్టుకున్నారు. అతని వాయిస్.. బిగ్ బాస్ సీజన్ వన్ లో వినిపించి ఆకట్టుకుంది. అతనెవరో తెలుసుకోవాలని అందరూ భావించారు. కానీ షో అయిపోయింది. తాజాగా రెండో సీజన్ మొదలయింది.
ఇప్పుడు కూడా అదే గొంతు అదరగొడుతోంది. ఇప్పుడు మళ్ళీ అతనెలా ఉంటాడో చూడాలని ఆత్రుత పెరిగింది. అందుకే బిగ్ బాస్ ఎవరో ఆరా తీస్తే అసలు విషయం బయటికి వచ్చింది. హిందీ టీవీ సీరియళ్లకు డబ్బింగ్ చెప్పే రాధాకృష్ణ అనే ఆర్టిస్టు బిగ్ బాస్ అని తెలిసింది. ఇతను గతంలో టాలీవుడ్ లో పరభాషా విలన్లకు కూడా డబ్బింగ్ చెప్పారు. అలాగే అతని వాయిస్ ని పోలి ఉండే మరో ఆర్టిస్టు శంకర్ ని కూడా స్టాండ్ బై గా తీసుకున్నట్టు సమాచారం. శంకర్ స్టార్ మా చానల్లో ప్రసారమయ్యే కొన్ని హిందీ సీరియళ్ల తెలుగు డబ్బింగ్ కార్యక్రమంలో భాగం పంచుకునేవారు. వీరిద్దరూ బిగ్ బాస్ గా వ్యవహరిస్తున్నారు. వారి చిత్రాలు బయటికి రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ రాధాకృష్ణ ఫోటోలు మీడియాకి చిక్కాయి.