సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చి ‘రాజకుమారుడు’ ‘మురారి’ వంటి సూపర్ హిట్ చిత్రాలు అందుకున్నాడు. కానీ మహేష్ ను మాస్ హీరోగా.. స్టార్ హీరోగా నిలబెట్టే సినిమా మాత్రం ఆ టైములో పడలేదు. అలాంటి టైములో ‘ఒక్కడు’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి మహేష్ కు మాస్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. ఇక అదే ఏడాది తేజ డైరెక్షన్లో మహేష్ హీరోగా చేసిన ‘నిజం’ చిత్రం రాబోతుంది అంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయి.
‘ఇడియట్’ వంటి సూపర్ హిట్ అందుకున్న రక్షిత హీరోయిన్. ‘జయం’ వంటి సూపర్ హిట్ చిత్రంలో విలన్ గా నటించిన గోపీచంద్.. ‘నిజం’ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఆర్.పి.పట్నాయక్ వంటి ఫామ్లో ఉన్న స్టార్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అంతకంటే ఏమి కావాలి.. ‘నిజం’ సినిమా పై అంచనాలు పెరగడానికి? అందుకే ‘నిజం’ సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి. అయితే 2003 మే 24న విడుదలైన ‘నిజం’ చిత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది. దానికి కారణం ‘ఒక్కడు’ సినిమానే అని డైరెక్టర్ తేజ తేల్చి చెప్పేసాడు. “నేను ‘బాబీ’ చిత్రం చూసి మహేష్ బాబు నా సినిమాకి సూట్ అవుతాడు అనుకుని ‘నిజం’ మొదలు పెట్టాను.
అప్పటికి అతను స్టార్ కాదు. కానీ ‘ఒక్కడు’ రిలీజయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. దాంతో మహేష్ బాబు కూడా పెద్ద స్టార్ అయిపోయాడు.అయితే ‘ఒక్కడు’ కంటే ‘నిజం’ ముందు రిలీజ్ అవ్వాలి కానీ .. ‘నిజం’ లేట్ గా విడుదలయ్యింది. దాంతో ‘ఒక్కడు’ సినిమాలో మహేష్ ను చూసిన వాళ్ళు.. ‘నిజం’ సినిమాలో మహేష్ ను చూడలేకపోయారు. అందుకే ప్లాప్ అయ్యింది” అంటూ తేజ చెప్పుకొచ్చాడు. ఇక ‘ ‘నిజం’ చిత్రం ప్లాప్ అయినా నష్టాలు రాలేదు. 7 కోట్లకు అమ్మితే 10 కోట్ల పైనే కలెక్ట్ చేసింది’ అని కూడా తేజ తెలిపాడు. అయితే అప్పటి లెక్కల ప్రకారం ‘నిజం’ ప్లాప్ అనే చెప్పాలి.