Netflix: నెట్ ఫ్లిక్స్ ఫెయిల్యూర్ వెనుక కారణాలివేనా?
January 30, 2022 / 10:46 PM IST
|Follow Us
గత కొన్నేళ్లలో ఓటీటీల హవా ఊహించని స్థాయిలో పెరిగింది. యువతలో చాలామంది ఓటీటీలలో సినిమాలను, వెబ్ సిరీస్ లను చూడటానికి ఎంతగానో ఇష్టపడుతున్నారు. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, సోనో లివ్, జీ5, స్పార్క్ మరికొన్ని ఓటీటీలు తెలుగు ప్రేక్షకులకు, మన దేశ ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఓటీటీలలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఎక్కువ సంఖ్యలో సబ్ స్క్రైబర్లతో అగ్రస్థానంలో ఉంది.
మన దేశంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రైబర్ల సంఖ్య 5 కోట్లకు అటూఇటుగా ఉంది. మరోవైపు అమెజాన్ ప్రైమ్ కు సబ్ స్క్రైబర్ల సంఖ్య 2 కోట్లకు అటూఇటుగా ఉంది. అయితే నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రైబర్ల సంఖ్య మాత్రం కేవలం 50 లక్షలకు అటూఇటుగా ఉండటం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకున్న నెట్ ఫ్లిక్స్ ఇండియాలో మాత్రం ఇతర ఓటీటీలకు గట్టి పోటీని ఇవ్వడంలో ఫెయిల్ అవుతోంది.
నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ధర మరీ ఎక్కువగా ఉండటంతో పాటు ప్రాంతీయ భాషల సినిమాలు నెట్ ఫ్లిక్స్ లో ఎక్కువగా అందుబాటులో లేకపోవడంతో మన దేశంలో నెట్ ఫ్లిక్స్ కు ఆదరణ కరువైంది. అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ ఇండియన్ సినిమాలను ఎక్కువగా ప్రసారం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అందువల్ల వీటి ధరలు ఎక్కువే అయినా సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరుగుతోంది. పలు టెలీకాం కంపెనీలు సైతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ పై ఆఫర్లను అందిస్తుండటం ఈ ఓటీటీలకు ప్లస్ అవుతుండటం గమనార్హం.
నెట్ ఫ్లిక్స్ కొత్త వ్యూహాలను అమలు చేసి ఇతర ఓటీటీలకు గట్టి పోటీని ఇస్తుందేమో చూడాల్సి ఉంది. రీజనల్ కంటెంట్ పై దృష్టి పెడితే మాత్రమే నెట్ ఫ్లిక్స్ ఇండియన్ మార్కెట్ లో సత్తా చాటుతుందని చెప్పవచ్చు.