Vikram Vedha: ‘రావణాసుర’ ముందు అనుకున్న సినిమా ఏమైందంటే?
January 28, 2022 / 11:36 AM IST
|Follow Us
తమిళంలో ఘన విజయం సాధించిన ‘విక్రమ్ వేద’ సినిమాను ఇప్పుడు హిందీలో సైఫ్ అలీఖాన్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో రూపొందిస్తున్నారు. అయితే మీకు గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాను తెలుగులో కూడా చేయాలని అనుకున్నారు. చాలా రోజుల ఈ సినిమా విషయంలో చర్చలు, పనులు కూడా జరిగాయి. రవితేజ ఓ ప్రధాన పాత్రగా ఈ సినిమా అనుకున్నారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని తెలిసింది. అయితే ఏమైందో ఏమో కానీ.. ఆ సినిమా ఆగిపోయింది. అయితే దానికి కారణం ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ చర్చ నడుస్తోంది.
రవితేజ, సుధీర్ వర్మ కాంబినేషన్లో ఇటీవల ‘రావణాసుర’ అనే సినిమా మొదలైన విషయం తెలిసిందే. నిజానికి ఈ సినిమాకు ముందు ఈ ఇద్దరు ‘విక్రమ్ వేద’ రీమేక్ చేద్దామని అనుకున్నారు. దీని కోసం కొన్ని రోజులు సుధీర్ వర్క్ కూడా చేశాడు. నటీనటుల ఎంపిక మీద కూడా దృష్టి సారించాడు. కానీ వేరే హీరో దగ్గర ప్రాజెక్ట్ ఆగిపోయిందట. అవును ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారనే విషయం తెలిసిందే. ఒక హీరో రవితేజ ఓకే… రెండో హీరో దగ్గరే పని ఆగిందట.
2017లో తమిళనాట విడుదలైన ‘విక్రమ్ వేద’ భారీ విజయం అందుకుంది. ఇందులో విజయ్ సేతుపతి వేద పాత్రలో కనిపించాడు. విక్రమ్ పాత్రను మాధవన్ పోషించాడు. విక్రమ్, వేద… రెండు పాత్రలూ బలంగానే ఉంటాయి. అయితే వేద పాత్రను చేయడానికి రవితేజ ఓకే అయిపోయారు. దీంతో విక్రమ్ పాత్ర కోసం ఇతర హీరోలను సంప్రదించారట. ఈ క్రమంలో ఎవరూ ముందుకు రాలేదని సమాచారం. అంతేకాదు సంప్రదించిన హీరోలంతా తమకు వేద పాత్ర కావాలని అడిగారట. కానీ ఆ పాత్ర చేయాలని రవితేజ పక్కాగా ఉండటంతో… మార్పు సాధ్యమైంది. సినిమా కూడా అసాధ్యంగా మిగిలిపోయింది.
పాత్ర మార్చుకోవడానికి రవితేజ ఓకే అనకపోవడంతో ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు. దీంతో ఆ రీమేక్‌ను పక్కనపెట్టి ‘రావణసుర’ సినిమా మొదలుపెట్టారట. ఇందులో రవితేజ పాత్ర కొత్తగా ఉంటుంది అంటున్నారు. విలన్‌గా దక్షా నగార్కర్ నటిస్తోందని సమాచారం. మొత్తంగా సినిమాలు నలుగురు హీరోయిన్లు ఉంటారట.