Chiranjeevi: చిరు పాటకు .. ఇద్దరు కొరియోగ్రాఫర్లు, ఎందుకలా..?
August 24, 2022 / 07:02 PM IST
|Follow Us
సినీ పరిశ్రమలోని కొందరు దర్శకులకు మూస ధోరణిలో వెళ్లడం ఇష్టం ఉండదు. ఏం చేసినా, ఏం తీసినా తమదైన ముద్ర వేయాలని భావిస్తారు. కొందరు పాటలు బాగా తీస్తే, ఇంకొందరు ఫైట్స్ బాగా తీస్తారు, కామెడీని ఇరగదీసేవారు కొందరైతే, కంటతడి పెట్టించే వారు మరికొందరు. అలా తనదైన ప్రత్యేకత చాటుకోవాలని చూసేవారు దివంగత దర్శక నిర్మాత విజయ బాపినీడు. ఆయన ఏం చేసినా వైవిధ్యంగానే ఉండేదని ఇండస్ట్రీ టాక్. మెగాస్టార్ చిరంజీవి-బాపినీడుది హిట్ కాంబినేషన్.
వీరిద్దరి కలయికలో వచ్చిన ‘పట్నం వచ్చిన పతివ్రతలు’, ‘మగ మహారాజు’, ‘మహానగరంలో మాయగాడు’, ‘హీరో’, ‘మగధీరుడు’, ‘ఖైదీ నెం 786’, ‘గ్యాంగ్ లీడర్’ వంటి సినిమాలు ఇండస్ట్రీ హిట్ లుగా నిలిచాయి. ఇక గ్యాంగ్ లీడర్ సంగతి చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలోని పాటలు, యాక్షన్ సీక్వెన్సులు, ఫైట్స్ ఆంధ్ర దేశాన్ని ఒక ఊపు ఊపేయడంతో పాటు చిరంజీవి స్టార్ డమ్ ని ఎవరెస్ట్ పైకి ఎక్కించింది. అలాంటి విజయ బాపినీడు..
చిరంజీవితో ‘బిగ్ బాస్’ తీశాడు. ఏకంగా రెండు లక్షల మంది మెగా అభిమానుల సమక్షంలో బిగ్ బాస్ ఓపెనింగ్ నిర్వహించారు విజయ బాపినీడు. అంతేకాదు.. ‘గ్యాంగ్ లీడర్’ కు బాణీలు సమకూర్చిన బప్పీలహరికి మరో ఛాన్స్ ఇచ్చారు. ఇక ‘బిగ్ బాస్’ సినిమాలోని పాటల విషయంలో ప్రత్యేక ముద్ర వేయాలని భావించారు విజయ బాపినీడు. ఇందులోని ఒక పాట సగభాగాన్ని చిన్ని ప్రకాశ్‌తో, మరో సగభాగాన్ని రాజు సుందరం చేత కొరియాగ్రఫీ చేయించారు.
వైవిధ్యంగా రావాలనే ఉద్దేశంతోనే ఇద్దరు కొరియోగ్రాఫర్లతో తీయించినట్లు విజయ బాపినీడు చెప్పారు. అయితే ‘బిగ్ బాస్’ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. కానీ పాటలు సూపర్ హిట్ అవ్వడమే కాకుండా అప్పట్లో ఆడియో రైట్స్ అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. మోహన్ బాబు రవిరాజా పినిశెట్టి కాంబినేషన్ లో వచ్చిన ‘పెదరాయుడు’ కలెక్షన్ల వర్షం కురిపించి.. ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.దాని పక్కన ‘బిగ్ బాస్’ నిలబడలేకపోయింది.