ఇక డబ్బింగ్ సినిమాలకి తెలుగు టైటిల్స్ పెట్టేలా లేరు..!
June 22, 2022 / 10:49 AM IST
|Follow Us
ఈ మధ్య కాలంలో తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తున్న సినిమాలకు తెలుగు నేటివిటీకి తగ్గ టైటిల్ పెట్టకుండా మన మొహాన్ని కొట్టేస్తున్నారు పరభాషా ఫిలిం మేకర్స్. అసలు తెలుగులో డబ్ చేసే సినిమాలను కూడా వాళ్ళు మనసుపెట్టి విడుదల చేస్తున్నారా? లేక ‘సినిమా ఎలా ఉన్నా సరే తెలుగు ప్రేక్షకులు చూసేస్తారులే’ అనే లోకువ కట్టేసి విడుదల చేస్తున్నారో తెలియని ఘోరమైన పరిస్థితి ఇది. అంతేకాదు ఈ డబ్బింగ్ సినిమాలకి సరైన రిలీజ్ డేట్లు కూడా ప్లాన్ చేసుకోకుండా రిలీజ్ చేసి చేతులు దులిపేసుకుంటున్నారు.
అజిత్ ‘వలీమై’ సంగతి చూసుకుందాం. ఈ చిత్రానికి తెలుగులో ‘బలం’ అనే అర్ధం వచ్చేలా టైటిల్ పెట్టి ఉండొచ్చు. కానీ అలా పెట్టలేదు. తమిళ్ లో పెట్టిన టైటిల్ తోనే తెలుగులో కూడా విడుదల చేసేసారు. అది కూడా ‘భీమ్లా నాయక్’ పక్కన రిలీజ్ చేశారు. అంటే సినిమా ప్లాప్ అయితే ‘భీమ్లా నాయక్’ పై తోసేయ్యొచ్చు అనేది వారి ఉద్దేశం కావచ్చు. సరిగ్గా ఇలాగే.. సూర్య హీరోగా నటించిన ‘ఈటి’ చిత్రానికి కూడా చేశారు.
ఆ సినిమాకి కూడా తెలుగు టైటిల్ పెట్టొచ్చు కానీ ‘ఎవ్వరికీ తలవంచడు’ అనే అర్ధం వచ్చేలా క్యాప్షన్ పెట్టేసి మన మొహాన కొట్టారు. అది కూడా ప్రభాస్ ‘రాధే శ్యామ్’ పక్కన రిలీజ్ చేశారు. అలాగే విజయ్ సేతుపతి- నయనతార- సమంత ప్రాధాన పాత్రల్లో తెరకెక్కిన ‘కాతు వాకుల రెండు కాదల్’ చిత్రాన్ని ‘కన్మణి ఖటీజా రాంబో’ టైటిల్ తో రిలీజ్ చేశారు. దీనిని కూడా ‘ఆచార్య’ వంటి బడా సినిమా పక్కన విడుదల చేశారు.
తమిళ మేకర్స్ ను చూసి ఇప్పుడు మలయాళం వాళ్ళు కూడా ఇలాగే తయారయ్యారు. కాకపోతే వీళ్ళు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘కడువా’ చిత్రాన్ని అదే టైటిల్ తో జూన్ 30న విడుదల చేయబోతున్నారు.ఈ టైటిల్స్ విషయంలో మేకర్స్ చెప్పే రీజన్ ఏంటో తెలుసా.. తెలుగులో ఇంకో టైటిల్ పెడితే.. రెండు టైటిల్స్ ఉండడం వల్ల ఆ హ్యాష్ ట్యాగ్ అనేది ట్రెండింగ్లోకి రావడం లేదట. అందుకోసమే అదే టైటిల్ ను పెట్టేస్తున్నారట.