టాలీవుడ్లో ఇదేం పరిస్థితి… కొత్త సినిమాలు ఆగిపోతున్నాయట… ఎందుకంటే?
March 18, 2024 / 11:17 AM IST
|Follow Us
బడ్జెట్… ఇప్పుడు టాలీవుడ్లో ఈ టాపిక్ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎంతగా అంటే అవసరమైతే సినిమా షూటింగ్ మొదలుపెట్టొద్దు, ఒకవేళ మొదలుపెట్టినా మధ్యలోనే ఆపేద్దాం. ఆ తర్వాత చేతులు కాలినా ఆకులు పట్టుకోవడం లాంటివి వద్దు అని అనుకునేంత. ఆ మాటకొస్తే కొన్ని సినిమాలు ఇలానే ఆగిపోయాయి అని అంటున్నారు కూడా. కానీ ఎక్కడా ఈ విషయం అధికారికరంగా చెప్పడం లేదు. అలా అని ఆ సినిమాల అప్డేట్స్ కూడా రావడం లేదు. ఇక చర్చకు కారణం ఆయా సినిమాల హీరోల ప్రజెంట్ మార్కెట్ అని అంటున్నారు.
ఓవైపు టాలీవుడ్ పాన్ ఇండియా లెవల్ సినిమాలు తీస్తోంది అని అంటున్నాం. ఆ మాట నిజం కావొచ్చు. కానీ కొంతమంది హీరోల పారితోషికం వాళ్ల మార్కెట్ కంటే ఎక్కువగా ఉంది అని అంటున్నారు. ఈ కారణంతోనే ప్రామింగ్ హీరోలు, యంగ్ హీరోల సినిమాలు ఆగిపోయాయి. ఈ మాట అంటే కాదు కాదు మా సినిమా ఆగలేదు అని అంటారేమో కానీ.. ఆ సినిమా అప్డేట్ అయితే రావడం లేదు. అయితే రెమ్యూనరేషన్ తగ్గించుకోవడం, బడ్జెట్ కుదించడం లాంటివి చేయడంతో కొన్ని సినిమాలు తిరిగి మొదలవుతున్నాయి అని అంటున్నారు.
వివిధ కారణాల వల్ల అంతా ఓకే అనుకుని ఆగిపోయిన సినిమాల సంగతి చూస్తే… రవితేజ (Ravi Teja) – గోపీచంద్ మలినేని (Gopichand Malineni) సినిమా ఇటీవల కాలంలో ఆగిపోయిన తొలి సినిమా అని చెప్పొచ్చు. మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసి కొన్ని రోజులకు ఆపేసింది. పారితోషికం దగ్గర చర్చలే ఈ సినిమా ఆగడానికి కారణం అంటుంటారు. ఆ తర్వాతి వరుసలో గోపీచంద్ (Gopichand) – శ్రీను వైట్ల (Srinu Vaitla) సినిమా ఉంది అంటున్నారు. ఈ సినిమా బడ్జెట్ కారణంగా ఆపేశారు అని చెబుతున్నారు. కానీ ఎక్కడా ఆ మాట అధికారికం కాదు.
మూడో సినిమా వరుణ్‌తేజ్ (Varun Tej) ‘మట్కా’ (Matka) అంటున్నారు. వరుసగా ఫ్లాప్ సినిమాలు మూట గట్టుకుంటున్న వరుణ్‌తేజ్… ఈ సినిమాతో కమ్ బ్యాక్ ఇద్దాం అంటే.. కొత్త షెడ్యూల్ ఇప్పట్లో స్టార్ట్ చేసే పరిస్థితి లేదు అంటున్నారు. హిట్ ట్రాక్‌లో లేని హీరోగా అంత పెద్ద సినిమానా అనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారని టాక్. ఇక కల్యాణ్ రామ్ (Kalyan Ram) ‘బింబిసార 2’ (Bimbisara) విషయంలోనూ ఇదే చర్చ అని సమాచారం. ఆ లెక్క తేలితే కొత్త దర్శకునితో ఆ సినిమా మొదలవుతుందట. ఇటీవల మొదలైన కొత్త సినిమా పరిస్థితీ ఇదే అని సమాచారం. వీళ్ల సినిమాలే కాదు మరికొంతమంది యువ హీరోల సినిమాలూ ఇలానే హోల్డ్‌లో ఉన్నాయట.