TNR.. తుమ్మల నరసింహా రెడ్డి అనగానే ఎక్కువగా గుర్తొచ్చేది ఆయన ఇంటర్వ్యూలే. ఓ వైవు సినీ ప్రస్థానం, మరోవైపు జర్నలిజం ఫీల్డ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన నటించింది చిన్న పాత్రలోనే అయినప్పటికీ మంచి గుర్తింపు అందుకున్నారు. నేనే రాజు నేనే మంత్రి, హిట్, జాతిరత్నాలు, జార్జిరెడ్డి వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించిన విషయం తెలిసిందే.
ఇక ఫ్రాంక్లీ విత్ TNR షోతో మొత్తంగా 189 ఇంటర్వ్యూలు చేసిన ఆయన డైరెక్టర్ తేజతో మొదటి ఇంటర్వ్యూను స్టార్ట్ చేశారు. ఇక ఎక్కువగా రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో క్రేజ్ అందుకున్నారు. చివరిగా 189వ ఇంటర్వ్యూను ఐ డ్రీమ్ చైర్మన్ చిన్న వసుదేవ రెడ్డితో చేశారు. ఇక ఆయన ఇంటర్వ్యూ కోసం తీసుకునే రెమ్యునరేషన్ పై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. రూ.50 వేల నుంచి రూ.80 వేల మధ్య ఉంటుందని సమాచారం. నెలసరి ఆదాయం కూడా లక్షల్లోనే ఉంటుందని కథనాలు వెలువడుతున్నాయి.
నిజానికి TNR జర్నలిజంలో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫోకస్ మొత్తం తన డ్రీమ్ పైనే ఉండేది. ఎలాగైనా దర్శకుడు కావాలని అనుకున్నారు. కొన్నేళ్ల క్రితం చిన్న చిన్న సినిమాలకు సహాయక దర్శకుడిగా కూడా వర్క్ చేసిన అనుభవం ఉంది. ఆలీ పిట్టల దొర వంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. ఇక ఇంటర్వ్యూలతో క్రేజ్ అందుకున్న తరువాత కూడా ఎలాగైనా మంచి సినిమాతో దర్శకుడిగా తన పేరును వెండితెరపై చూడాలని కలలు కన్నారు. కానీ ఆ కోరిక తీరకుండానే కరోనా వైరస్ కారణంగా ఆయన తుది శ్వాస విడువడం బాధాకరమని సన్నిహితులు ఎమోషనల్ అవుతున్నారు.