‘క్యాస్ట్ నో బార్’ అంటున్న సినీనటులు..!

  • December 21, 2021 / 03:21 PM IST

కులం.. మోడరన్ కల్చర్‌లో కూడా వైబ్రేషన్స్ పుట్టించే ఈ పేరు మనిషిని కలుపుతుంది.. అదే మనిషిని మృగంగా మారుస్తుంది. ఇండియాలో ఇది అణుబాంబు కంటే పవర్‌ఫుల్. వడ్డించే వాడు మనోడు అయితే చాలు అన్నట్టు… ‘‘మనోడు’’ అన్న మాటకు పలుకుబడి ఎక్కువ. భారత్‌లోని అన్ని రంగాల్లో క్యాస్ట్ ఫీలింగ్ ఉందన్న విషయం ఓపెన్ సీక్రెట్. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఇక్కడ క్యాస్ట్‌దే పెత్తనమంతా.. శతృవుల్ని మిత్రులుగా మార్చినా.. ప్రాణ స్నేహితులను బద్ధ విరోధులుగా మార్చినా అంతా క్యాస్ట్ చలవే. ప్రేమ, పెళ్లిళ్ల విషయంలో కుల పట్టింపులు ఎక్కువ. పీహెచ్‌డీలు, డాక్టర్లు, ఇంజనీర్లు అయినా సరే కులం దగ్గర తల వంచక తప్పదు.

ఈ విషయం ఎన్నోసార్లు రుజువైన సందర్భాలు అనేకం. ఈ సంగతి పక్కన బెడితే మన టాపిక్ ‘టాలీవుడ్-ఇంటర్‌క్యాస్ట్ మ్యారేజ్‌’ల విషయానికొస్తే.. తెలుగు సినిమా పుట్టిన నాటి నుంచి నేటి వరకు క్యాస్ట్ డామినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదట్లో బ్రాహ్మణులు టాలీవుడ్‌లో ఆధిపత్యం చలాయించారు. ఆ తర్వాత కమ్మ కులానికి చెందిన వారు 60వ దశకం నుంచి నేటి వరకు ఇండస్ట్రీని తమ గుప్పిట్లో ఉంచుకున్నారు. హీరోలు, నిర్మాతలు, దర్శకులు, టెక్నీషీయన్లు ఎక్కువ మంది ఈ సామాజిక వర్గానికి చెందిన వారే వుండటం ఇందుకు కారణం. పాత తరంలో చాలా మంది తమ కులానికి చెందిన వారినే వివాహం చేసుకున్నప్పటికీ.. రాను రాను ఈ పోకడ మారింది. పవన్ కల్యాణ్-రేణు దేశాయ్, మహేష్ బాబు-నమ్రతా శిరోద్కర్, రాంచరణ్-ఉపాసన, అల్లు అర్జున్ – స్నేహా రెడ్డిలు టాలీవుడ్ లో ట్రెండ్ మార్చారాని అనుకుంటున్నారు. అయితే తోటీ నటీనటుల పై ఆకర్షణ, చదువుల కారణంగా అప్పట్లో కులాంతర వివాహం చేసుకున్న వారు చాలా మందే ఉన్నారు. వారిలో

కృష్ణ-విజయనిర్మల:

తెలుగు సినిమా తొలి జేమ్స్ బాండ్‌గా, కౌబాయ్‌గా సినీ పరిశ్రమలో తన మార్క్ చూపిస్తున్న టైంలో విజయనిర్మలను పెళ్లి చేసుకుని ఈ సంచలనాల హీరో మరో సంచలనాన్ని క్రియేట్ చేశారు. అప్పటికే కృష్ణకు ఇందిరాదేవితో వివాహామైంది. అయితే ‘సాక్షి’సినిమా షూటింగ్ టైంలో విజయనిర్మలతో ప్రేమలో పడ్డ ఆయన పెద్దల అంగీకారంతో ఆమెను వివాహం చేసుకున్నారు.

నాగార్జున-అమల:

అమ్మాయిల కలల రాకుమారుడిగా, మన్మథుడిగా, రోమాంటిక్ హీరోగా యూత్‌లో ఫాలోయింగ్ సంపాదించారు కింగ్ అక్కినేని నాగార్జున. మూవీ మొఘల్, స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు కుమార్తె లక్ష్మీతో నాగ్‌కు వివాహామైంది. కానీ అర్థాంతరంగా వీరి బంధం తెగిపోయింది. హీరోగా అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న నాగార్జున 1989లో ‘కిరాయిదాదా’ సినిమా షూటింగ్ సమయంలో అమలతో ప్రేమలో పడ్డారు. ఆమె ఉత్తరాదికి చెందిన మహిళ..కానీ వీరి వివాహానికి ఏఎన్ఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నాగ్-అమల ఒక్కటయ్యారు.

పవన్ కల్యాణ్-రేణూ దేశాయ్:

పవర్‌స్టార్‌గా, యూత్ ఐకాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న పవన్ కల్యాణ్ సైతం ప్రేమలో పడ్డాడు. బద్రీ సినిమా షూటింగ్‌లో ఉత్తరాదికి చెందిన రేణూ దేశాయ్‌ని ప్రేమించి..డేటింగ్ తర్వాత ఆమెను వివాహాం చేసుకున్నాడు. ఆయనకు అప్పటికే విశాఖకు చెందిన నందినితో పెళ్లయ్యింది. అయితే కొన్నాళ్లకే ఈ జంట విడిపోయింది. రెండో పెళ్లిలో పక్క రాష్ట్రానికి చెందిన అమ్మాయిని ప్రేమించిన పవర్ స్టార్..

మూడోసారి ఏకంగా విదేశీయురాలి ప్రేమకు దాసోహమయ్యాడు. జయంత్ సీ పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన ‘తీన్‌మార్’సినిమా సమయంలో రష్యా పౌరురాలు అన్నా లెజ్‌నోవాను పెళ్లి చేసుకున్నారు.

మహేష్ బాబు-నమ్రతా శిరోద్కర్:

సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ తండ్రి కృష్ణనే ఆదర్శంగా తీసుకున్నారు ప్రిన్స్ మహేశ్ బాబు. వంశీ సినిమా షూటింగ్ సమయంలో బాలీవుడ్ నటి నమ్రతతో ప్రేమలో పడిన ఈ రాజకుమారుడు.. సుధీర్ఘ డేటింగ్ తర్వాత ఆమెను పెళ్లాడాడు. మొదట్లో దీనికి తండ్రి వ్యతిరేకించినా ఆ తర్వాత ప్రోసీడ్ అన్నారు. ఈ దంపతులకు గౌతమ్, సితార జన్మించారు.

రాంచరణ్-ఉపాసన:

మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా తెలుగు తెరకు పరిచయమైన రాంచరణ్ తేజ్.. డ్యాన్సులు, ఫైట్లు, నటనలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ కొత్త తరంలో నెంబర్‌వన్ రేసులో దూసుకెళ్తున్నాడు. తన చిన్న నాటి స్నేహితురాలు, అపోలో ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డి మనవరాలు ఉపాసన కామినేనిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. రాంచరణ్ కాపు కులానికి చెందిన వారు కాగా, ఉపాసన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు.

అల్లుఅర్జున్-స్నేహారెడ్డి:

మెగా ఫ్యామిలీలో తర్వాత తరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్.. డ్యాన్స్ , యాక్టింగ్‌లో మావయ్య చిరంజీవిని గుర్తు చేస్తూ స్టైలీష్ స్టార్‌గా ఎదిగాడు. వ్యక్తిగత జీవితంలో స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిది కూడా కులాంతర వివాహామే.. బన్నీ కాపు కులానికి చెందిన కుర్రాడు కాగా, స్నేహా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు.

నాగచైతన్య-సమంత:

అక్కినేని మూడో తరం వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నవయువ సామ్రాట్ నాగచైతన్య. ప్రేమ కథలు, రోమాంటిక్ జోనర్స్‌లో తాత, తండ్రికి ఏ మాత్రం తీసిపోని విధంగా నటిస్తూ యూత్‌లో లవర్ బాయ్‌గా క్రేజ్ సంపాదించుకున్నాడు. వ్యక్తిగత జీవితంలో తండ్రిలాగే ప్రేమ వివాహానికే చైతు మొగ్గు చూపాడు. ఏమాయ చేశావేలో తనతో పాటు నటించిన సమంతతో ప్రేమలో పడిన నాగచైతన్య.. లాంగ్ రన్‌లో డేటింగ్ చేసి సమంతను పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. సమంత కేరళకు చెందిన క్రిస్టియన్ అమ్మాయి కాగా, చైతు కమ్మ… తెలుగబ్బాయి. వీరిద్దరూ పెళ్లి విషయంలో తమ రెండు మత సంప్రదాయాలను పాటించారు.

సుమంత్-కీర్తిరెడ్డి:

అక్కినేని నాగేశ్వరరావు మనవడు, కింగ్ నాగార్జున మేనల్లుడు సుమంత్ యార్లగడ్డ మావయ్య దారిలోనే సినీ పరిశ్రమకు చెందిన అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంలో 2004లో హీరోయిన్ కీర్తిరెడ్డితో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు ఈ జంట జీవితం సాఫీగానే సాగినప్పటికీ ఆ తర్వాత ఇద్దరికి పోసకపోవడం, సుమంత్ సోదరి సుప్రియతో కూడా విబేధాలు రావడంతో పెళ్లయిన రెండేళ్లకే 2006లో విడాకులు తీసుకున్నారు.

సుప్రియ యార్లగడ్డ-చరణ్ రెడ్డి:

అక్కినేని వంశానికే చెందిన ఈమె మావయ్య నాగార్జున, అన్నయ్య సుమంత్ దారిలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇష్టం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చరణ్ రెడ్డితో ప్రేమలో పడిన సుప్రియ కొన్నాళ్ల పాటు అన్యోన్యంగానే ఉన్నారు. ఈ దంపతులకు ఒక పాప కూడా ఉంది. అయితే ఆ తర్వాత చెడు వ్యసనాలకు బానిసగా మారిన చరణ్‌కి ఎంత చెప్పినా అతని ప్రవర్తనలో మార్పురాకపోవడంతో విడాకులిచ్చేసింది. సుప్రియ నుంచి విడిపోయిన తర్వాత కూడా చరణ్‌లో ఎలాంటి మార్పు రాకపోగా, వ్యసనాలకు మరింత దగ్గరై… ప్రాణాలను కోల్పోయాడు.

మంచు విష్ణు, మంచు మనోజ్: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయులు ఇద్దరు ప్రేమ వివాహానికే ఓటేశారు. పెద్దకుమారుడు మంచు విష్ణు… వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన సీసీరెడ్డి మనవరాలు వెరోనికాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

చిన్నబ్బాయి మనోజ్ తన చిన్ననాటి స్నేహితురాలు ప్రణతీ రెడ్డితో ప్రేమలో పడి, పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. తనయులు ఇద్దరు వేరే కులానికి చెందిన అమ్మాయిలను ప్రేమించినప్పటికీ.. మోహన్ బాబు కులం పట్టింపు లేకుండా ఇద్దరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం.

అభిమానులు నటీనటులను..ఎంతగానో అభిమానించి వారిని, వారి విధానాలను అనుకరిస్తారు. పెళ్లిళ్ల విషయంలోనూ వారినే ఆదర్శంగా తీసుకుని కులాల వారీగా విడిపోయిన సమాజాన్ని కలిపితే అంతకన్నా ఏం కావాలి. తారలను చూసి అనేక మంది కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుని కుల రహిత సమాజం నిర్మితమయ్యే దిశగా అడుగులు వేయ్యాలని ఆశిద్దాం.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus