Tollywood: 2023 సెకండాఫ్లో ప్రేక్షకుల నాడి పట్టేది ఎవరో..!
July 22, 2023 / 09:28 PM IST
|Follow Us
తెలుగు లో ఇప్పటి వరకూ రిలీజైన సినిమాలను పరిశీలిస్తే, సరికొత్త కంటెంట్ తో రూపొందిన చిత్రాలనే తెలుగు ప్రేక్షకులు హిట్ చేస్తున్నారనే విషయం స్పష్టం అవుతోంది. ఇటీవల కాలంలో సినీ ప్రియుల అభిరుచిలో చాలా మార్పులు వచ్చాయి. ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో విస్తృతమైన కంటెంట్ చూడటానికి అలవాటు పడిన జనాలు.. ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ తో వచ్చిన సినిమాలను మాత్రమే ఆదరిస్తున్నారు. సెలెక్టివ్ గా థియేటర్ కు వెళ్లి మూవీస్ చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారు. కాకపోతే ఎప్పుడు ఎలాంటి జోనర్ చిత్రాలని ఆదరిస్తున్నారనేది అర్థం చేసుకోవడమే ఫిలిం మేకర్స్ కు కష్టతరంగా మారింది.
ఒక్కోసారి మాస్ యాక్షన్, థ్రిల్లర్ జోనర్ సినిమాలను ఇష్టపడితే.. ఇంకోసారి యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్లు, ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామాలను లైక్ చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహా రెడ్డి’ వంటి యాక్షన్ సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. కంటెంట్ పరంగా యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టగలిగాయి. వీటితో పాటుగా వచ్చిన ‘వారసుడు’ వంటి తమిళ డబ్బింగ్ చిత్రం కూడా విజయం సాధించగా, ‘కళ్యాణం కమనీయం’ వంటి ఫ్యామిలీ డ్రామా ఫ్లాప్ అయింది. ‘రైటర్ పద్మభూషణ్’ ను హిట్ చేసిన ఆడియన్స్.. ‘బుట్టబొమ్మ’ ను రిజెక్ట్ చేశారు. హంట్, మైఖేల్, అమిగోస్ వంటి యాక్షన్ థ్రిల్లర్స్ డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి.
పీరియడ్ డ్రామాగా తెరకెక్కిన ‘సార్’ విజయం సాధించగా.. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ వంటి రొమాంటిక్ యాక్షన్ మూవీ పర్వాలేదనిపించింది. ‘బలగం’ అనే సోషల్ డ్రామా సెన్సేషనల్ హిట్ గా నిలవగా, ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ వంటి రొమాంటిక్ డ్రామా పరాజయం పాలైంది. యాక్షన్ కామెడీ థ్రిల్లర్ జోనర్ లో తీసిన ‘దాస్ కా ధమ్కీ’ యావరేజ్ ఫలితాన్ని అందుకోగా, ‘రంగమార్తండ’ వంటి సోషల్ డ్రామా థియేటర్లలో పెద్దగా ఆడలేదు. అదే సమయంలో ‘దసరా’ వంటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించింది.
సైకాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘రావణాసుర’.. ‘ఏజెంట్’, ‘స్పై’ వంటి స్పై యాక్షన్ చిత్రాలు మాత్రం డిజాస్టర్ ఫలితాన్ని చవిచూశాయి. మిస్టీకల్ హారర్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’ మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వచ్చిన ‘ఉగ్రం’ మూవీ ఓకే అనిపించింది. ‘మీటర్’, ‘రామబాణం’ సినిమాలు ఘోర పరాజయం పాలయ్యాయి. ‘కస్టడీ’ సినిమా కూడా ఫ్లాప్ అయింది కానీ, ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఇది బాక్సాఫీసు వద్ద మరీ అంత దారుణమైన రిజల్ట్ అందుకోవాల్సిన మూవీ కాదనే కామెంట్స్ వినిపించాయి. ఇక భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రాలైన ‘శాకుంతలం’, ‘ఆదిపురుష్’ ప్రేక్షకులని తీవ్రంగా నిరాశ పరిచాయి.
‘మేమ్ ఫేమస్’ ‘పరేషాన్’ వంటి యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్లు టాక్ తో సంబంధం లేకుండా అంతో ఇంతో వసూళ్ళు రాబట్టాయి. ‘పఠాన్’, ‘బిచ్చగాడు 2’ ‘2018’ వంటి డబ్బింగ్ సినిమాలు కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రభావాన్ని చూపించాయి. అన్నీ మంచి శకునములే, మళ్లీ పెళ్లి, అహింస, నేను స్టూడెంట్ సర్, టక్కర్ సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి. చివరగా ‘సామజవరగమన’ వంటి కామెడీ ఎంటర్టైనర్ తో పాటుగా, న్యూ ఏజ్ యూత్ ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ‘బేబీ’ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.
ఈ రెండు చిత్రాలు ఓవర్సీస్ లోనూ మంచి కలెక్షన్లు సాధించాయి. ఇప్పుడు లేటెస్టుగా థియేటర్లలోకి వచ్చిన ‘హిడింబ’ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటి వరకూ విడుదలైన సినిమాలు, వాటి ఫలితాలను బేరీజు వేసుకుని చూస్తే.. థ్రిల్లర్స్ కంటే ఫ్యామిలీ డ్రామాలు, కామెడీ ఎంటర్టైనర్లు ఎక్కువగా ప్రేక్షకాదరణ పొందాయి. వైవిద్యమైన కంటెంట్ తో మేకింగ్ పరంగా కొత్తదనం చూపించిన సినిమాలే హిట్టయ్యాయి. కథపై దృష్టి పెట్టకుండా భారీతనం పేరుతో హై బడ్జెట్, అదనపు హంగులు జోడించిన చిత్రాలను ఆడియన్స్ నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేశారు. ఎప్పుడైనా కంటెంటే కింగ్ అని మళ్లీ మళ్లీ స్పష్టం చేస్తూ వస్తున్నారు.
2023 సెకండాఫ్ లో (Tollywood) పవన్ కళ్యాణ్ ‘బ్రో’, చిరంజీవి ‘భోళా శంకర్’, విజయ్ దేవరకొండ ‘ఖుషి’, ప్రభాస్ ‘సలార్ 1’, రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’, రామ్ పోతినెని ‘స్కంధ’, బాలకృష్ణ ‘భగవత్ కేసరి’, నాని ‘హాయ్ నాన్న’, వెంకటేశ్ ‘సైందవ’ వంటి పలు క్రేజీ చిత్రాలు రాబోతున్నాయి. అలానే ‘లియో’, ‘జైలర్’ ‘యానిమల్’ ‘టైగర్’ వంటి కొన్ని డబ్బింగ్ చిత్రాలు కూడా విడుదల కానున్నాయి. మరి వీటిల్లో ఏవేవి ప్రేక్షకులని మెప్పిస్తాయో వేచి చూడాలి.