కోలీవుడ్ లో హిట్ అయిన చిత్రాలను తెలుగులో రీమేక్ చేసే సంప్రదాయం ఎప్పటి నుంచో వస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ గతంలో తమిళ కథలతో భారీ హిట్స్ సొంతం చేసుకున్నారు. అందుకే ఇప్పటికీ ఆ స్టోరీలపై మక్కువ చూపిస్తున్నారు. వారితో పాటు కొత్తగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈ బాటలో నడుస్తున్నారు.
ఖైదీ నంబర్ 150మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ల తర్వాత వెండి తెరపై రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందుకోసం ఎన్నో కథలను విన్న చిరు సంతృప్తి చెందలేదు. తమిళంలో విజయ్ హీరోగా ఏ.ఆర్.మురుగదాస్ తెరకెక్కించిన “కత్తి” సినిమా నచ్చడంతో ఆ కథను తీసుకున్నారు. అందుకు పరుచూరి బ్రదర్స్ కలాన్ని జోడించి ఖైదీ నంబర్ 150 గా మెరుగులుదిద్దించారు. మాస్ డైరక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఈ చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
ధృవమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇది వరకు ఎప్పుడు రీమేక్ జోలికి పోలేదు. తొలి సారి తమిళ కథను ఆశ్రయించారు. గత ఏడాది తమిళంలో హిట్ సాధించిన “తని ఒరువన్” చిత్రాన్ని రీమేడ్ చేస్తున్నారు. యాక్షన్ డైరక్టర్ సురేందర్ రెడ్డి తన దైన స్టైల్ లో తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ కి ఈ చిత్రం రిలీజ్ కానుంది.
కాటమరాయుడుకెరీర్ తొలి నాళ్లలో తమిళ స్టోరీస్ హిట్ కొట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ ఆ కథలపై ఆసక్తి కనబరుస్తున్నారు. అజిత్ నటించిన “వీరమ్” మూవీని కాటమ రాయుడుగా రీమేక్ చేస్తున్నారు. డాలీ డైకక్షన్లో ఈ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీని తర్వాత పవన్ చేయనున్న మూవీ కూడా తమిళ కథ కావడం విశేషం.
గురుతమిళం, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఇరుది శుత్రు/ సాలా కడూస్ .. రెండూ చోట్ల ఘన విజయం సాధించింది. మాధవన్ నటించిన ఆ కథతో విక్టరీ వెంకటేష్ “గురు” గా మన ముందుకు రాబోతున్నారు.