Costumes Krishna: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు, నిర్మాత కన్నుమూత!

  • April 2, 2023 / 10:54 AM IST

ప్రముఖ నటుడు, కాస్ట్యూమ్స్‌ కృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన చెన్నైలోని తన ఇంట్లో ఆదివారం తుదిశ్వాస విడిచినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఈ మేరకు కాస్ట్యూమ్స్‌ కృష్ణ చనిపోయినట్లు, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్‌ చేశారు. దీంతో ఈ విషయం అందరికీ తెలిసింది. కాస్ట్యూమ్స్‌ కృష్ణ కన్నుమూశారనే వార్తతో టాలీవుడ్‌లో విషాదం అలముకుంది. కాస్ట్యూమర్‌గా, నటుడిగా ఆయన పరిశ్రమలో చాలామందికి సుపరిచితం. ఆ తర్వాత నిర్మాతగా కూడా చేశారు.

కాస్ట్యూమ్స్ కృష్ణ స్వస్థలం విజయనగరం జిల్లా, లక్కవరపుకోట. 1954 సమయంలో చెన్నై వెళ్లి సినిమాల్లో పని చేయడం ప్రారంభించారు ఆయన. తొలుత కాస్ట్యూమ్స్‌ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌ కాస్ట్యూమర్‌గా పని చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత రామానాయుడు వద్దకు చేరి ఆయన నిర్మాణ సంస్థలోని సినిమాలకు కాస్ట్యూమర్ పని చేశారు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, చిరంజీవి, జయసుధ, శ్రీదేవి లాంటి స్టార్‌ నటులకు కాస్ట్యూమర్‌గా పని చేశారు. అప్పటి ట్రెండ్‌ను ఫాలో అవుతూనే కొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేస్తూ వావ్‌ అనిపించారు ఆయన.

సరిగ్గా ఆ సమయంలో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ దృష్టిలో పడ్డారు కాస్ట్యూమ్స్‌ కృష్ణ(Costumes Krishna) . ఆయనలోని వైవిధ్యమైన నటుణ్ని చూసిన కోడి రామకృష్ణ.. సినిమాల్లో నటించమని కోరారు. అయితే కృష్ణ తొలుత అంగీకరించలేదు. తాను కాస్ట్యూమ్స్‌ లో బిజీగా ఉన్నానని, నిర్మాత అవ్వాలనే ఆలోచన ఉందని చెప్పారట. అయితే కోడి రామకృష్ణ ఒప్పించే ప్రయత్నం, ఇంట్లో వాళ్లు చెప్పడంతో ఎట్టకేలకు ‘భారత్ బంద్’ సినిమాలో విలన్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. ఆ సినిమాలో ఆ పాత్రకు భలే రెస్పాన్స్‌ వచ్చింది.

ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. అదే సమయంలో నిర్మాతగా సినిమాలు చేశారు కూడా. ఆయన నిర్మించిన సినిమాల్లో నటించారు కూడా. నిర్మాతగా తొలి సినిమాను కృష్ణతో ‘అశ్వత్థామ’ చేశారు. ఆ సినిమా ఇచ్చిన విజయంతో ‘పెళ్లాం చెబితే వినాలి’, ‘పుట్టింటికా రా చెల్లి’, ‘పెళ్లి పందిరి’ తదితర సినిమాలు ప్రొడ్యూస్‌ చేశారు. జగపతిబాబుతో చేసిన ‘పెళ్లి పందిరి’ ఆయన ఆఖరి సినిమా. నటుడిగా ‘అల్లరి మొగుడు’, ‘దేవుళ్ళు’, ‘మా ఆయన బంగారం’, ‘విలన్’, ‘శాంభవి ఐపిఎస్’, ‘పుట్టింటికి రా చెల్లి’ సినిమాల్లో నటించారు.

అంతా బాగుంది అనుకుంటూ ఉండగా ఆయన నిర్మించిన ‘పెళ్లి పందిరి’ సినిమా ఇబ్బంది పెట్టింది అని అంటారు. ఆ సినిమా కోసం ప్రచారం అక్కర్లేదు అనుకుని మౌత్‌ పబ్లిసిటీ మీద నమ్మకం పెట్టుకున్నారు ఆయన. అయితే బయ్యర్స్‌ మాత్రం పబ్లిసిటీ కావాలి అని అడిగారు. దాని కోసం తామే రెండు లక్షలు ఇస్తామని చెప్పి రెండు కాగితాల మీద సంతకం చేయించుకున్నారు. అక్కడే మతలబు జరిగిందంటారు. ఒక కాగితం మీద అప్పు ఇచ్చినట్లు రాసుకోగా, మరో కాగితం మీద ఆ సినిమా నెగిటివ్‌ రైట్స్‌ రాయించుకున్నారట.

దీంతో మోసపోయానని గ్రహించిన కృష్ణ.. పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. చెన్నైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో జీవితం కొనసాగిస్తూ వచ్చారు. అయితే ‘పెళ్లి పందిరి’ సమయంలో జరిగింది అంటున్న ఈ ఘటన గురించి స్పష్టమైన సమాచారం లేదు. సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడు అనారోగ్యంతో కన్నుమూశారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus