తెలుగు చిత్రాల్ల్లో నటించే కథానాయకులకు కథల ఎంపికలో కొన్ని పరిధులు ఉంటాయి. కథలు తమకంటే ముందు అభిమానులకు నచ్చుతుందా? లేదా? అనే కోణంలో ఆలోచిస్తుంటారు. ఇప్పుడు ఆ ఆలోచనల్లో మార్పు వస్తోంది. ఆడియన్స్ కొత్త కథలను హిట్ చేస్తున్నారు. అందులో నటించింది చిన్న హీరోనా, పెద్ద హీరోనా అని చూడడం లేదు. అందుకే స్టార్స్ ప్రయోగాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. మాస్ మహారాజ్ గా పేరు దక్కించుకున్న రవితేజ అంధుడిగా నటించడానికి సిద్ధమయ్యారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘రాజా ది గ్రేట్’ చిత్రంలో రవితేజ గుడ్డివాడిగా నటించనున్నారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కలయికలో రూపుదిద్దుకోనున్న మూవీలో చెర్రీ చెవిటి వాడిగా నటించనున్నట్లు సమాచారం.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో త్రిపాత్రాభినయం చేయబోతున్నారు. ఇందులో ఒకటి నెగిటివ్ క్యారక్టర్ అని తెలిసింది. సీనియర్ హీరోలు సైతం ప్రయోగాలకు వెనుకాడడం లేదు. ప్రస్తుతం ‘గురు’ షూటింగ్ పూర్తిచేసిన విక్టరీ వెంకటేష్ క్రిష్ తో మూవీ చేయనున్నారు. ఇందులో వెంకీ రోల్ కొత్తగా ఉంటుందని టాక్. వరుస విజయాలతో దూసుకుపోతున్న కింగ్ నాగార్జున ‘రాజుగారి గది 2’లో నటిస్తున్నారు. హారర్ కామెడీ నేపథ్యంలో సాగే ఇలాంటి కథలో నటించడం నాగ్‌కి ఇదే తొలిసారి. ఇలా టాలీవుడ్లో హీరోలందరూ ప్రయోగాలు చేయడానికి సిద్ధమయ్యారు. ప్రేక్షకులు ఎంత మేర హిట్ చేస్తారో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.