సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. శరత్ బాబు మరణం తర్వాత వరుసగా ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. యాంకర్ శివాని సేన్, తమిళ నిర్మాత ఎస్ఏ రాజ్ కన్న, గాయని, హసీబా నూరి, రాకేష్ మాస్టర్ ఇలా ఎంతో మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ విషాదాల నుండి కోలుకోకముందే చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ప్రముఖ సినీ రచయిత, పేరడీ రచయితగా పేరొందిన శ్రీరమణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ వస్తున్న ఆయన… ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు చివరి శ్వాస విడిచారు. శ్రీరమణ వయసు 70 ఏళ్లు.నేషనల్ అవార్డు అందుకున్న ‘మిథునం’ చిత్రానికి ఈయన కథ అందించడం జరిగింది.2014లో హాస్య రచన విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయం నుండి కీర్తి పురస్కారాన్ని అందుకున్నారు శ్రీరమణ. ఈయన స్వస్థలం గుంటూరు జిల్లా, వేమూరు మండలంకి చెందిన వరహాపురం అగ్రహారం.సొంత ఊరిలోనే ఫస్ట్ ఫారమ్‌లో చేరిన శ్రీరమణ.. తర్వాత బాపట్ల ఆర్ట్స్ కాలేజీలో పీయూసీ పూర్తి చేసినట్టు తెలుస్తుంది.
అనంతరం ఆయన ‘నవ్య’ వార పత్రికకు ఎడిటర్‌గానూ పనిచేసినట్టు సమాచారం. శ్రీకాలమ్, శ్రీఛానెల్, చిలకల పందిరి, హాస్య జ్యోతి, మొగలి రేకులు వంటి ఎన్నో శీర్షికలను ఈయన రచించడం జరిగింది. శ్రీరమణ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అని అంతా కామెంట్లు చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కూడా అంతా కోరుకుంటున్నారు.