Trivikram: ‘భీమ్లా ..’ క్రెడిట్ ఆయనదే.. అని మళ్లీ మళ్లీ చెప్పడంలో ఉద్దేశమిదేనా!
February 28, 2022 / 08:15 AM IST
|Follow Us
‘భీమ్లా నాయక్’ విజయాన్ని పురస్కరించుకొని చిత్రబృందం హీరోలు లేకుండా ఓ ఈవెంట్ నిర్వహించింది. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం అంటే… త్రివిక్రమ్ స్పీచ్. సినిమాకు ఎవరెంత కష్టపడ్డారు అనే విషయాన్ని ఆయన స్టేజీ మీద బలంగా వివరించారు. ఈ సందర్భంగా దర్శకుడు సాగర్ కె చంద్ర పనితనం గురించి, సినిమా కోసం ఆయన పడ్డ కష్టం గురించి చక్కగా చెప్పారు. మామూలుగా అయితే ఇది పెద్ద విషయమేమీ కాదు. కానీ సినిమా రూపొందించడంలో దర్శకుడిని పూర్తిగా పక్కన పెట్టేశారు అంటూ పుకార్లు వచ్చిన నేపథ్యంలో త్రివిక్రమ్ మాటలు కీలకంగా మారాయి.
‘అయ్యప్పనుమ్ కొషియమ్’ సినిమా తెలుగు రీమేక్‌లో తొలుత ఫైనల్ అయిన నటుడు రానానే. పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రకు తొలుత నుండి ఆయన పేరు వినిపించింది. అయితే ఆఖరుగా ఆయన పేరు అనౌన్స్ చేశారు. అంతకుముందు బిజూ మేనన్ పాత్రకు పవన్ కల్యాణ్ పేరును ప్రకటించారు. ఈ క్రమంలో మాటలు, స్క్రీన్‌ప్లే రచయితగా త్రివిక్రమ్ పేరు బయటికొచ్చింది. ఆ అనౌన్స్మెంట్ జరగడం ఆలస్యం… సినిమాలో దర్శకుడు ఇక నామమాత్రమే అనే పుకార్లకు తెరలేపారు. సినిమా షూటింగ్ అవుతున్నంతసేపూ ఇదే మాట వినిపించింది.
సినిమా విషయంలో సాగర్ చంద్ర పరిమితం అనే పుకార్లు రేపారు. ఇలాంటి అన్ని పుకార్లకు సమాధానం… శనివారం జరిగిన ప్రెస్ మీట్లో త్రివిక్రమ్ సమాధానమిచ్చారు. సినిమాను సాగర్ చంద్ర చక్కగా హ్యాండిల్ చేశాడని చెబుతూనే, సినిమాలో ఆయన చేసిన మార్పులు, సినిమా కోసం రాసిన వెర్షన్లు అంటూ చాలా విషయాలు చెప్పుకొచ్చారు త్రివిక్రమ్. ఇటీవల జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్లో కూడా త్రివిక్రమ్ పెద్దగా కనిపించలేదు.
సినిమా దర్శకుణ్ని తొక్కేశారు అంటూ వార్తలొస్తున్న నేపథ్యంలో త్రివిక్రమ్ తన వంతు ప్రయత్నం చేశారు. ఇక ఇప్పటికైనా దర్శకుడి గురించి, సినిమాను ఆయన తీర్చిదిద్దిన విధానం గురించి మాట్లాడితే… ఆయనకు గౌరవంగా ఉంటుంది. త్రివిక్రమ్ మాటలు, రచన ఈ సినిమాకు బలం కావొచ్చు. కానీ సినిమాను హ్యాండిల్ చేసింది సాగర్ చంద్రనే కదా.