‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయిన వెంటనే… ఎన్టీఆర్ త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చేయబోతున్నట్టు నిర్మాతలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ మరియు ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ వారు ఆనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ ను ఈ చిత్రం కోసం రిజిస్టర్ చేసినట్టు కూడా టాక్ నడుస్తుంది. 2021 సమ్మర్ కి ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు కూడా నిర్మాతలు ప్రకటించారు. అయితే ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ కు లాక్ డౌన్ వల్ల అంతరాయం కలిగింది.
జూన్ వరకూ షూటింగ్ తిరిగి మొదలు కాకపోవచ్చు అనే డిస్కషన్ నడుస్తుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఏప్రిల్ 15 న లాక్ డౌన్ ఎత్తేస్తే.. అంత ఇబ్బంది లేకపోయేది. కానీ ఇప్పుడున్న భయంకరమైన పరిస్ధితితుల్లో లాక్ డౌన్ కొనసాగించాల్సిందే అనే డిస్కషన్లు నడుస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ‘ఆర్.ఆర్.ఆర్’ కచ్చితంగా జనవరి 8 కి విడుదల అయ్యే అవకాశాలు తక్కువే ఉన్నాయి.
నిర్మాత దానయ్య అయితే చెప్పారు కానీ.. కష్టమే అని ఇన్సైడ్ టాక్. దీంతో త్రివిక్రమ్… బాలయ్య -రానా లతో ‘అయ్యప్పనుమ్ కోసియుమ్’ అనే మలయాళం చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే ఈ చిత్రం రీమేక్ రైట్స్ ను ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు కొనుగోలు చేసి పెట్టుకున్నారు. త్రివిక్రమ్ వారికి అత్యంత సన్నిహితుడు కాబట్టి.. ఈ రీమేక్ ను డైరెక్ట్ చేయమని వారు కోరారట. 3 నెలల్లో ఈ రీమేక్ ను పూర్తి చెయ్యాలి అనే ఆలోచనలో కూడా త్రివిక్రమ్ ఉన్నట్టు తెలుస్తుంది.