మొదటి సినిమా సంగతులు గుర్తు చేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్!
November 23, 2017 / 07:16 AM IST
|Follow Us
తెలుగు చిత్ర పరిశ్రమలోని టాప్ డైరక్టర్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఆయన సినిమా మొదలు పెట్టగానే బిజినెస్ మొదలైపోతుంది. అది ఇప్పటి మాట. అతని తొలినాళ్లలో ఎన్నో కష్టాలు అనుభవించారు. వాటిని చెప్పడానికి ఇష్టపడని త్రివిక్రమ్ రీసెంట్ గా బయటపెట్టారు. త్రివిక్రమ్ శిష్యుడు వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఛలో మూవీ టీజర్ రిలీజ్ విడుదల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. తన శిష్యుడి చిత్ర టీజర్‌ని విడుదల చేసిన త్రివిక్రమ్ తన తొలి చిత్ర అనుభవాలను ఈ వేదికపై పంచుకున్నారు.
‘‘ఈ సినిమా దర్శకుడు వెంకట్ నాకు చాలా పరిచయం ఉన్న ఇష్టమైన వ్యక్తి. గురుశిష్యులు అనాలి అంటే అది చాలా పెద్దమాట. ఇవాళ గురువులు అనేవారు ఎవ్వరూ లేరు. నేర్పించేవాళ్లు అంతకంటే లేరు. వెంకీ ప్రయాణంలో నేను కూడా ఉన్నానంతే. అతను సొంతంగా సినిమా చేయడం నాకు సంతోషం కలిగించే విషయం. తొలిసారి దర్శకత్వం చేసిన దర్శకుడు బాధలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. తొలి సినిమా తీసి విడుదల చేయడం చాలా కష్టం. అలాంటి కష్టం నేను అనుభవించాను. నేను కథ, మాటలు రాసిన తొలి సినిమా ‘స్వయంవరం’కి ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఆ సినిమాను నిర్మించి విడుదల చేయడానికి నిర్మాతలు చాలా కష్టపడ్డారు. సినిమా హాళ్లలో ఆ సినిమా ఎన్ని రోజులు నడిచిందో.. ప్రివ్యూ థియేటర్లలో కూడా అన్ని రోజులు నడిచింది. ఈ సినిమాని ఎంతమందికి చూపించామో లెక్కే లేదు.
ప్రతి డిస్టిబ్యూటర్కి షో వేసి ఆ సినిమా చూపించాల్సి వచ్చింది. ఇలాంటి అనుభవాన్ని నా తొలి సినిమాకి ఫేస్ చేశాను. అయితే వెంకీకి అలాంటి సమస్య లేదు. ఈ సినిమా వెనుక సినిమా అంటే ఫ్యాషన్ ఉన్న నిర్మాత సాయి కొర్రపాటిగారు ఉన్నారు’’ అని త్రివిక్రమ్ తొలి చిత్ర అనుభవాలను వెల్లడించారు. నాగశౌర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా యువతను ఆకట్టుకుందని చిత్ర బృందం ధీమా తో ఉంది.