ఎన్టీఆర్ మా పక్కన నిల్చోని సినిమా పూర్తి చేయించాడు – త్రివిక్రమ్ శ్రీనివాస్

  • July 8, 2020 / 12:05 PM IST

త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ పేరు వినగానే మనకి వెంయనే గుర్తొచ్చేది ఆయన మాటలే. అందుకే ఆయన్ని ముద్దుగా “మాటల మాంత్రికుడు” అని పిలుస్తారు. ఆయన అభిమానులైతే “గురూజీ” గౌరవిస్తుంటారు. అందుకే ఆయన హిట్ సినిమా ఆయన మీద గౌరవం పెంచలేదు, ఆయన ఫ్లాప్ సినిమా ఆ గౌరవాన్ని ఇసుమంత కూడా తగ్గించలేదు. ఆయన వ్యక్తిత్వం కూడా అంతే హిట్ లేదా ఫ్లాప్ బట్టి ఏమాత్రం మారలేదు. అందుకే ఆయన అందరికీ ఇష్టుడయ్యాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “అరవింద సమేత వీరరాఘవ” అక్టోబర్ 11న విడుదలవుతోంది. అసలు మీడియా ముందుకురావడానికి సిగ్గుపడే త్రివిక్రమ్ చాన్నాళ్ల తర్వాత మీడియా మిత్రులతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..!!

మార్చిలోనే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిపోయామ్.. ఎన్టీఆర్ తండ్రి ఆకస్మిక మరణం తర్వాత నేను, ప్రొడ్యూసర్ సినిమా షూటింగ్ ను నిరవధికంగా నిలిపివేసి.. ఎన్టీఆర్ కి ఒక నెలరోజులు గ్యాప్ ఇచ్చి సినిమాని వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో రిలీజ్ చేద్దాం అనుకున్నాం. కానీ.. ఎవరూ ఊహించని విధంగా రెండో రోజు సాయంత్రం ఎన్టీఆర్ ఫోన్ చేసి.. “షూటింగ్ లో ఎలాంటి మార్పులు లేవు, నేను రేపటి నుంచి షూటింగ్ కి వస్తున్నాను” అని చెప్పిన తర్వాత కాస్త ఊపిరి పీల్చుకున్నాం. ఒక వ్యక్తిగా ఎన్టీయార్ నిబద్ధత ఆ సమయంలో అర్ధమైంది.

ఎంత కాదనుకున్నా తప్పడం లేదు.. సినిమా షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యాక ఎంత కాదనుకున్నా ఎన్టీఆర్ తండ్రి గురించి డిస్కషన్ వచ్చేది. ఇంటర్వ్యూస్ లో కూడా అలాగే ఉండేది. కానీ.. ఎన్టీఆర్ ఎక్కడా బరస్ట్ అవ్వకుండా చాలా మెచ్యూర్డ్ గా డీల్ చేసిన విధానం నన్ను ఆశ్చర్యపరిచింది. అతను నాకు 13 ఏళ్లుగా తెలిసిన వ్యక్తి అయినప్పటికీ.. గత కొన్ని రోజులుగా అతడ్ని చూస్తున్నప్పుడు కలిగే భావన వేరేలా ఉంటుంది.

యుద్ధం తర్వాత పర్యవసానాల గురించి ఎవరూ చెప్పలేదు.. ఇప్పటివరకూ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలోచ్చినా కూడా.. యుద్ధం పూర్తవ్వడంతో సినిమా పూర్తైపోతుంది తప్పితే.. యుద్ధం తర్వాత పర్యవసానాలేమిటి అనేది మాత్రం ఎవరూ ప్రస్తావించలేదు. రామాయణ, మహాభారతాలు కూడా యుద్ధం ముగియడంతో కథలు కంచెకెళ్లిపోయాయి కానీ.. ఆ తర్వాత పరిస్థితుల గురించి ఎవరూ చదవరు. యుద్ధం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏంటీ అనే ఆలోచనలో పుట్టిన కథ “అరవింద సమేత”. అందుకే ఈ చిత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది.

ఇంట్లో ఉన్న పెళ్ళాంతో ఎందుకు డిస్కస్ చేయం.. సాధారణంగా మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఊర్లో ఉన్నవాళ్లందరితో డిస్కస్ చేస్తాం.. ఒక్క ఇంట్లో ఉన్న భార్యతో తప్ప. అలా ఎందుకు చేస్తాం అనేది మనకి కూడా పెద్ద క్లారిటీ ఉండదు. ఆడవాళ్ళకి ఏమీ తెలియదు అని ముందు నుంచీ మనం ఫిక్స్ అవ్వడం వల్ల వాళ్ళని తక్కువ చేసి చూస్తాం. కానీ.. ఒకవేళ భార్య మాట వింటే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో చూపించబోతున్నాం. ఎన్టీయార్ ని బాగా ఎగ్జైట్ చేసిన పాయింట్ ఇది.

ఇప్పుడు సమాజంలో మంచి ఎక్కడుంది.. బేసిగ్గా ఇదివరకూ సాహిత్యం “మంగళం” (మంచి)తో మొదలై మరో మంగళంతో ముగిసేది. కానీ.. ఇప్పుడు సమాజంలో మంచి అనేది ఎక్కడుంది. ఉదయం లేచిన దగ్గర్నుంచి టీవీలో, పేపర్ లో హత్యలు, అత్యాచారాలు చూస్తున్నాం. అందుకే సాత్వికుడైన మనిషి కూడా రాటుదేలిపోయాడు. అందుకే.. ప్రస్తుత సమాజ ధోరణికి “అరవింద సమేత” లాంటి సినిమా అవసరం అనిపించింది.

రిలీజ్ అయ్యాక సినిమా గురించి మర్చిపోతాను.. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకసారి సినిమా ఫైనల్ కాపీ రెడీ అయిపోయింది అంటే నేను ఆ సినిమా గురించి మర్చిపోతాను. కానీ.. సినిమా ఫస్ట్ కాపీ పూర్తయ్యేవరకూ ఏ రోజు, ఏ షాట్ తీశాను, అది ఎప్పుడు తీశాను అని కూడా గుర్తుంటుంది. అందుకే ఒక సినిమా విజయం కానీ.. ఆ సినిమా హైలైట్స్ కానీ ఇంకో సినిమా లేదా కథను ఇన్ఫ్లూయన్స్ చేయవు.

కోబలి కథకి అరవింద సమేతతో సంబంధం లేదు.. పవన్ కళ్యాణ్ కోసం నేను రాసుకొన్న “కోబలి” కూడా ఫ్యాక్షన్ నేపధ్యం సినిమా అయినప్పటికీ.. అది ప్యారలెల్ సినిమా. పాటలు లేకుండా చాలా రా & వైల్డ్ గా తీద్దామనుకొన్న సినిమా అది. కాకపోతే.. ఆ సినిమాకు కథ రాసుకొనే సమయంలో నేను సాహిత్యం, మాండలీకం, రాయలసీమ సంస్కృతి వంటి విషయాల మీద చేసిన రీసెర్చ్ “అరవింద సమేత” సినిమాకి బాగా పనికొచ్చింది.

పెంచల్ దాస్ లో రాయలసీమ కనిపించింది.. సీమ నేపధ్యంలో సినిమా కాబట్టి అక్కడి వ్యక్తులు ఎవరైనా ఇన్వాల్వ్ అయితే బెటర్ అనుకున్నప్పుడు సీమ నుంచి వచ్చిన చాలా మందిని కలిశాను కానీ.. వాళ్లెవరిలో నాకు సీమ కనిపించలేదు. పెంచల్ దాస్ సీమలో బ్రతకడమే కాదు.. ఆయనలో సీమ కనిపించింది నాకు. పైగా.. ఆయన రచయిత మాత్రమే కాదు గాయకుడు కూడా. అన్నిటికీ మించి ఆయన తిరుమల రామచంద్రగారి అనుంగ శిష్యుడు. మా ఇద్దరి మధ్య సినిమాలకంటే కూడా సాహిత్య చర్చలు ఎక్కువగా ఉండేవి.

పెనివీటిలో మీరు చూసింది 40% మాత్రమే.. “పెనివిటి” పాట విడుదలైనప్పట్నుంచి ప్రేక్షకులు ఆ పాటకు, ముఖ్యంగా లిరిక్స్ కు జనాలు చాలా బాగా కనెక్ట్ అయ్యారు. అయితే.. ప్రోమో విడుదల చేసిన తర్వాత చాలామంది షాక్ అయ్యారు. ఈ పాట ఇలా ఉందేంటి అని. కానీ.. అందరూ చూసింది 40% మాత్రమే. మిగతా పాట మొత్తం మాంటేజ్ లా ఉంటుంది. సినిమాలో ఆ పాట చూసి అందరూ తప్పకుండా కనెక్ట్ అవుతారు.

యుద్ధంతో కాదు చర్చతో ముగుస్తుంది.. నా సినిమాల్లో ఇప్పటివరకూ హీరో అనేవాడు విలన్ ని చంపడు. ఈ సినిమాలో కూడా అంతే. అయితే.. మునుపటి సినిమాల తరహాలో యుద్ధంతో కాకుండా ప్రెజంట్ జనరేషన్ కి చెందిన ఇద్దరు యువకుల చర్చతో సినిమా ముగుస్తుంది. సినిమాకి హైలైట్ అంటూ ఏదైనా ఉంటే నా వరకూ ఈ ఇద్దరి మధ్య సాగే కన్వర్జేషనే.

ఎన్టీఆర్ కి చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి.. ఎన్టీఆర్ సినిమాలంటే ఫ్యాన్స్ మాత్రమే కాదు సగటు సినిమా ప్రేక్షకుడు కూడా భారీ స్థాయి డైలాగ్స్ ఎక్స్ పెక్ట్ చేస్తాడు. అందులోనూ ఫ్యాక్షన్ సినిమా కాబట్టి ఆ ఎక్స్ పెక్టేషన్స్ ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. అయితే.. ఈ సినిమాలో ఫస్టాఫ్ మొత్తం ఎన్టీఆర్ కి చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి. సెకండాఫ్ లో డైలాగ్స్ ఉంటాయి కానీ అవన్నీ ఎమోషనల్ గా ఉంటాయి. పైగా.. ఎన్టీఆర్ స్క్రిప్ట్ ఒకటికి పడిసార్లు వినడం వల్ల షూటింగ్ తక్కువ టైమ్ లో అయిపోతుంది.

ఫోర్స్డ్ కామెడీ అవసరం ఇకపై రాకపోవచ్చు.. ఇదివరకూ సినిమాలో కథ-కథనంతో సంబంధం లేకుండా కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ పెట్టి, కొన్ని సందర్భాలు సృష్టించి మరీ కామెడీ క్రియేట్ చేయాల్సి వచ్చేది. కానీ.. ఇప్పుడు ప్రేక్షకుడు కామెడీ కోసం థియేటర్ కి రావడం లేదు. జబర్డస్త్, ఎక్స్ ట్రా జబర్డస్త్ లాంటి షోలు, స్టాండప్ కామెడీలు అందుబాటులోకి వచ్చాక జనాలు ఆసక్తికరమైన కథ-కథనం మరియు ఎమోషన్స్ కోసమే థియేటర్స్ వస్తున్నారు. భవిష్యత్ ల్లో సిచ్యుయేషనల్ కామెడీ సీన్స్ తప్ప.. సపరేట్ కామెడీ ట్రాక్స్ ఉండవు.

నా సినిమాలకి అభిమానులుంటారు కానీ.. నాకు ఉండరు నావరకూ నేను నమ్మేది ఏంటంటే.. ఒక వ్యక్తిగా నన్ను ఇష్టపడేవాళ్ళకంటే, నా సినిమాలను ఇష్టపడేవాళ్లు ఎక్కువగా ఉంటారు. అందుకే నాకు అభిమానులు ఉంటారు అనేది నేను నమ్మను. సో, నా సినిమా వాళ్ళకి నచ్చాలి.

జగపతిబాబు పాత్ర చాలా మూర్ఖంగా ఉంటుంది.. ఈ సినిమాలో జగపతిబాబు క్యారెక్టర్ క్రూరంగా ఉండదు, మూర్ఖంగా ఉంటుంది. అతని పాత్ర ఒక నిండిపోయిన గ్లాస్ లాంటిది. ఎవరెంత మంచి చెప్పినా.. ఆల్రెడీ ఆ మైండ్ లో నెగిటివిటీ నిండిపోవడంతో పాజిటివ్ విషయాలను అస్సలు పెట్టించుకోరు, వినిపించుకోరు. జగపతిబాబు పాత్ర ఆ తరహాకు చెందిందే. చాలా ఇరిటేట్ చేస్తుంది.

నాన్నకు ప్రేమతో టైమ్ నుంచి అనుకుంటున్నాం.. గత 13 ఏళ్లుగా ఎన్టీఆర్ తో సినిమా చేయాలి అనుకుంటున్నప్పటికీ.. “నాన్నకు ప్రేమతో” సినిమా టైమ్ కి ఎన్టీఆర్ తో సీరియస్ గా సినిమా తీయాలి అని డిసైడ్ అయ్యాను. నాకున్న సమస్య ఏమిటంటే.. సడన్ గా అర్ధరాత్రి లేచి ఒక కథ రాసుకొని అద్భుతంగా ఉంది అనుకోని నిద్రపోతాను, మళ్ళీ ఉదయం లేచి చదువుకొనేసరికి.. ఏంటీ ఇలా రాశాను అని నాకే సిగ్గేస్తుంది. ఈ క్రమంలో ఓ నాలుగు కథలు చెప్పాను.. అందులో “అరవింద సమేత” సెట్ అయ్యింది.

జయాపజయాల్ని పెద్దగా ఎనలైజ్ చేయను.. సినిమా సూపర్ హిట్ అయినప్పుడు తెగ సంతోషపడిపోను.. అదే తరహాలో ఫ్లాప్ అయినప్పుడు కూడా విపరీతంగా బాధ కూడా పడను. బాక్సాఫీస్ లెక్కల్ని పట్టించుకోను అని అబద్ధం చెప్పను కానీ.. ఆ లాస్ గురించి అదే పనిగా ఆలోచిస్తూ మాత్రం కూర్చోను. రేపటికి దర్శకుడిగా నా జర్నీ మొదలై 16 ఏళ్లవుతుంది (నువ్వే నువ్వే అక్టోబర్ 10, 2002 విడుదలైంది) కానీ.. ఇన్నేళ్లలో నేను చేసింది కేవలం పది సినిమాలే. అందువల్ల సినిమా కథ-కథనాల గురించి ఆలోచించినంతగా.. వాటి రిజల్ట్స్ గురించి పట్టించుకోను. ఇక సదరు సినిమాల రిజల్ట్స్ బట్టి తప్పొప్పులు నేర్చుకోవడం అనేది ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది.

అత్తారింటికి దారేది తరహాలోనే అజ్ణాతవాసి.. నేను “అత్తారింటికి దారేది” సినిమా ఎలా అయితే తీశానో “అజ్ణాతవాసి” కూడా అదే ఫార్మాట్ మైండ్ సెట్ తో తీశాను. ఆ సినిమా హిట్ అయ్యింది, ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది అంటే చాలా కారణాలుంటాయి. వాటన్నిటినీ బేరీజు వేసుకొనే ముందుకు సాగుతాను. ఇక “అజ్ణాతవాసి” సినిమా కథ కాపీ అని విమర్శలు వచ్చిన విషయం నాకు తెలుసు కానీ.. నన్ను వచ్చి ఎవరూ ఇది నా కథ, నాకు డబ్బు కట్టు అని అడగలేదు.

ఇప్పుడు జనాల చేతిలోకి మొబైల్ వచ్చింది.. క్రిటిసిజం లేదా భావ వ్యక్తీకరణ అనేది ఎప్పుడూ ఉండేది. ఇంతకుముందు మనిషి తనకు కోపం వచ్చినా లేదా చిరాకు వచ్చినా.. తన భార్యాపిల్లలు లేదా స్నేహితులతో పంచుకొనేవాడు. ఇప్పుడు చేతిలోకి మొబైల్ వచ్చింది. అందువల్ల వెంటనే ఒక ట్వీట్ వేసేస్తున్నాడు. ఆ తర్వాత రెండో రోజు వాడికి అంత కోపం ఉండకపోవచ్చు. కానీ.. అన్నమాట వెనక్కి తీసుకోలేకపోతున్నాడు. అందుకే ఆ ఆన్ లైన్ క్రిటిసిజాన్ని నేను పెద్దగా పట్టించుకోను.

మహేష్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లకు దగ్గరవ్వడానికి కారణం అదే.. నేను ఇప్పుడు ఈ నిమిషం మీ అందరితో ఎలా అయితే ఉంటానో.. మహేష్, పవన్, ఎన్టీఆర్ లతోనూ అదే తరహాలో నిజాయితీగానే ఉంటాను. ఆ నిజాయితీ వాళ్ళకు నచ్చుతుంది కాబట్టి నాతో సహృదయంగా మెలగగలుగుతున్నారు. ఇందులో ట్రిక్స్, మ్యాజిక్స్ లాంటివి ఏమీ లేవు. అయినా.. వాళ్ళ దగ్గర నటించలేమ్ కదండీ, ఒకవేళ నటించినా ఎన్నాళ్లు నటిస్తాం చెప్పండి.

సునీల్ కి నేను ఇచ్చిన సలహా అదే.. సునీల్ నన్ను ఒకసారి “నేను ఈ చట్రంలో ఇరుక్కుపోయాను.. నన్ను బయటకు లాగు” అన్నాడు. నేను ఒక్కటే చెప్పాను “నువ్వు పోలోమని ప్రయత్నించకు, ఇప్పుడు కమిట్ అయిన ప్రొజెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేసేయ్, ఆ తర్వాత హీరోగా ఎలాంటి ప్రొజెక్ట్స్ కమిట్ అవ్వకు” అని. అంతే.. అప్పట్నుంచి తను మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.

రాముడు-భీముడులో ఏ రామారావు బాగున్నాడు అంటే ఏం చెప్తాను.. నేను కెరీర్ స్టార్ట్ చేసింది ఒక రైటర్ గా, డైరెక్టర్ గా మారిన తర్వాత కూడా ప్రేక్షకులు నాలోని రచయితనే మెచ్చుకున్నారు. అయితే.. నాలోని దర్శకుడు అంటే ఎక్కువ ఇష్టమా లేక రచయిత అంటే ఎక్కువ ఇష్టమా అని నన్ను అడిగితే నేనేమీ చెప్పలేను. ఇప్పుడు “రాముడు భీముడు” సినిమాలో ఏ ఎన్టీఆర్ బాగున్నాడు అని అడిగితే ఏం చెప్పగలం చెప్పండి.

హాలీవుడ్ సినిమాలు చూసినప్పుడల్లా తెగ ఆలోచించేసేవాడ్ని.. నేను హాలీవుడ్ సినిమాలు చాలా ఎక్కువగా చూసేవాడ్ని. ఒక్కోసారి వాళ్ళ కెమెరాలకు మన కెమెరాలకు ఏం తేడా. వాళ్లలా మనం కెమెరా యాంగిల్స్ ఎందుకు పెట్టలేం, వాళ్లలా సినిమాలు మనం ఎందుకు తీయలేం అనిపించేది. ఆ తర్వాత ఎనలైజ్ చేసినప్పుడు నాకు బోధపడిన విషయం ఏంటంటే.. హాలీవుడ్ లో వచ్చే సినిమాలు ఒక జోనర్ కి ఫిక్స్ అయ్యి ఉంటాయి. యాక్షన్ సినిమాలంటే యాక్షన్ మాత్రమే ఉంటుంది, హారర్ అంటే హారర్. కానీ.. మన తెలుగు సినిమాల్లో అన్నీ జోనర్స్ ఉండాలి. అందుకే మనం అలా క్రిస్ప్ ఫిలిమ్స్ తీయలేకపోతున్నాం.

అప్పట్లోనే 12 ఏళ్ళు పట్టింది.. “లవకుశ” అనే సినిమా కలర్ లో రూపొంది సూపర్ హిట్ అయిన తర్వాత కూడా మనం కలర్ లో సినిమాలు తీయడానికి భయపడ్డాం. కలర్ లో నాగేశ్వర్రావు, రాజేశ్వరి ఎలా ఉంటారో, జనాలు చూస్తారో లేదో అని భయపడ్డాం. లవకుశ విడుదలైన దాదాపు 12, 14 ఏళ్ల వరకూ కలర్ సినిమా మరెవరూ తీయలేదు. అలాగే.. ప్రస్తుతం తెలుగు సినిమా ఒరవడి ఒక పంథాలో సాగుతోంది. దీన్ని ఎవరైనా బ్రేక్ చేయాలి. ఆ బ్రేక్ చేసేది ఎవరు అనేది ప్రస్తుతానికి తెలియదు. నాకూ ఉంటుంది ఈ జోనర్స్ ని బ్రేక్ చేస్తూ ఒక సినిమా చేయాలి అని.. కానీ ముందు ఎవరైనా ఆ తరహా ప్రయత్నం చేసి హిట్ కొడితే చేద్దాంలే అని వెయిట్ చేస్తుంటాం అంతే.

అర్జున్ రెడ్డి, రంగస్థలం లాంటి సినిమాలు చూసి జెలస్ ఫీల్ అయ్యాను.. ఈమధ్యకాలంలో వచ్చిన కొన్ని సినిమాలు దర్శకుడినా విపరీతమైన జెలస్ ఫీల్ అయ్యేలా చేశాయి. వాటిలో “అర్జున్ రెడ్డి, రంగస్థలం, కేరాఫ్ కంచరపాలెం, గూఢచారి, ఆర్ ఎక్స్ 100, పెళ్ళిచూపులు”. ముఖ్యంగా “గూఢచారి” సినిమాను నన్ను అమితంగా ఆశ్చర్యపరిచింది. ఒక సింగిల్ జోనర్ లో లిమిటెడ్ రీసోర్సెస్ తో అంత అద్భుతమైన అవుట్ పుట్ ఇవ్వడం అనేది అభినందించాల్సిన విషయం.

దర్శకుడికి బడ్జెట్ పరిమితులు ఉండకూడదు.. ఒక దర్శకుడిగా నా మీద నిర్మాతలు ఎప్పుడు కూడా బడ్జెట్ సంబంధించిన ప్రెజర్ పెట్టలేదు. అలా పెట్టి ఉంటే ఇటలీలో తీయాల్సిన సీన్ హైద్రాబాద్ లో, బయట ఎక్కడైనా తీయాల్సిన సీన్ ఇంట్లో షూట్ చేయాలీ అనే ఆలోచన మొదలవుతుంది. అందువల్ల అవుట్ పుట్ దెబ్బ తింటుంది. అందుకే ఒక దర్శకుడు బడ్జెట్ గురించి ఎక్కువగా ఆలోచించకూడదు అంటాను. 1960లో “సంఘం” అనే సినిమాను 120 మంది ఆర్టిస్టులతో యూరప్ లో దాదాపు 60 రోజులపాటు షూట్ చేశారు. ఇప్పుడు ఫారిన్ షూట్స్ అంటే కనీసం అయిదారుగురు కూడా వెళ్ళడం లేదు.

ఎన్టీఆర్ చొక్కా పట్టుకొని లాక్కొచ్చాడు.. బేసిగ్గా నేను మీడియా అంటే చాలా సిగ్గుపడతాను. పొరపాటున ఒక కెమెరా కనబడినా కూడా పారిపోదాం అనుకొనే రకం నేను. కానీ.. ఈ సినిమాకి ఎన్టీఆర్ నన్ను చొక్కా పట్టుకొని మరీ ప్రమోషన్స్ కి లాక్కెళ్లిపోతున్నాడు (నవ్వుతూ). అంతే తప్ప ఈ సినిమా మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించడం లాంటిది ఏమీ లేదు.

కె.వి.రెడ్డి గార్ని గొప్ప డైరెక్టర్ ఎందుకంటారో అప్పుడు అర్ధమైంది.. నా కాలేజ్ టైమ్ లో “పాతాళ భైరవి” రీరిలీజ్ అయ్యింది. అప్పటికే చాలాసార్లు చూసినప్పటికీ ఎందుకో మళ్ళీ చూడాలి అనిపించి థియేటర్ కి వెళ్ళి సినిమా చూస్తున్నప్పుడు ఒక షాట్ నన్ను భీభత్సంగా ఎగ్జైట్ చేసింది. నిద్రపోతున్న రాజుకు ఒక కల వస్తుంది.. వెంటనే లేచి కిందకి వెళతాడు. అతడి పక్కనే అగరబత్తి ధూపపు పొగ కనిపిస్తుంది. అంటే.. ఆ పొగ నిజం కాబట్టి, ఆ కల కూడా నిజమని చెప్పడం ఆయన భావమా. అందుకే కె.వి.రెడ్డి గారి గొప్పదనం అప్పటికి అర్ధమైంది నాకు.

ఆన్ ది స్క్రీన్ మాత్రమే త్రివిక్రమ్ ని.. నన్ను నేను ఎప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ని అనుకొను. నాకు నేను ఎప్పుడు శ్రీనివాస్ ను మాత్రమే. సో, ఇమేజ్ చట్రం అనేది నేను ఎప్పుడు పట్టించుకోను. సో, హీరో ఇమేజ్ బట్టి నా సినిమా ఉండాలి అనేది ఎప్పుడు ప్రయత్నించలేదు. ఆ హీరోలు ఇంతకుముందు చేసిన తరహాలో మాత్రం చేయను.

తమన్ చాలా పెద్ద షాక్ ఇచ్చాడు.. నాకు తమన్ తో పెద్ద రిలేషన్ లేదు. ఏదో అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడడం తప్ప పెద్దగా అతనితో టైమ్ స్పెండ్ చేసింది లేదు. ఒకసారి డిస్కషన్స్ లో “ఆ సినిమాకి బీజీయమ్ అవసరం లేదండీ” అన్నాడు. నేను షాక్ అయ్యాను. ఏంటీ ఈ అబ్బాయికి సినిమాని ఇంత లోతుగా విశ్లేషిస్తాడా? అని షాక్ అయ్యాను. అలా చాలా సందర్భాల్లో నన్ను ఆశ్చర్యానికి గురి చేశాడు తమన్. అతనికి నేను ఏ సన్నివేశానికి, ఏ తరహా బీజీయమ్ కావాలి అని ఎప్పుడూ చెప్పలేదు. కేవలం కథ చెప్పాను.. దాన్నిబట్టి తమన్ సినిమాకి వర్క్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. పాటల్లో ఎక్కడా హిందీ ఉండకూడదు అని మాత్రమే నేను అడిగాను.

అనిరుధ్ సంగీతం నాకు అర్ధమవ్వడానికి ఇంకా టైమ్ పడుతుంది.. నిజానికి “అ ఆ” సినిమాకే అనిరుధ్ తో వర్క్ చేయాలి. అతను ఆ సమయానికి వేరే ఇష్యూస్ లో బిజీగా ఉండడంతో మిక్కీ జె.మేయర్ ను తీసుకోన్నాం. “అరవింద సమేత”కి అనిరుధ్ నే అనుకున్నాం. కానీ.. అతని సంగీతం అర్ధమవ్వడానికి నాకు, తెలుగు సినిమాకి సెట్ అవ్వడానికి అతనికి కొంత సమయం కావాలి అనిపించింది. అందుకే.. అనిరుధ్ తో కొన్నాళ్ళ తర్వాత వర్క్ చేస్తాను అని చెప్పాను.

 – Dheeraj Babu

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus