‘అ…ఆ’ సినిమా ద్వారా మరోసారి తన సత్తా చాటారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆరు రోజులకే పెట్టుబడిని రాబట్టుకొని చిన్న సినిమాల ద్వారా కూడా భారీ విజయాలను నమోదు చేయవచ్చని నిరూపించాడు. దీంతో “అ..ఆ” నిర్మాత ఎస్.రాధాకృష్ణతో మరో ప్రాజెక్ట్ కి లాక్ అయ్యాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని మరో మారు డైరక్ట్ చేయడానికి మాటల మాంత్రికుడు సిద్ధమయ్యాడు.
ఈ సినిమా పనులు మొదలుకాక ముందే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి త్రివిక్రమ్ అవకాశాన్ని అందుకున్నారు. ఈ బ్యానర్ అధినేత దిల్ రాజు “అ..ఆ” సినిమాను నైజాం ఏరియాల్లో పంపిణీ చేసారు. వారం కూడా పూర్తికాక ముందే లాభాలు రావడంతో సంతోష పడ్డారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో నాకు ‘నువ్వే కావాలి’ సినిమా నుంచి మంచి స్నేహం ఉంది. సినిమాల గురించి ఎన్నో విషయాలను చర్చించుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు మా బ్యానర్ లో ఆయన తో ఒక భారీ సినిమా చేయబోతున్నాం అని చెప్పారు. అప్పుడు హీరో ఎవరో చెప్పక పోవడంతో కాస్త సస్పెన్స్ నడిచింది.
సాయంత్రానికి ఈ సస్పెన్స్ కి తెర పడింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించనున్న సినిమాలో హీరో రామ్ చరణ్ అని ప్రకటన వెలువడింది. మాటల మాంత్రికుడి, చరణ్ కాంబినేషన్లో రానున్న మూవీ తప్పకుండా హిట్ సాధిస్తుందని మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేసారు.